Minister Jogi Ramesh : మంత్రిగా తొలిసంతకం చేసిన జోగి రమేశ్, విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు
Jogi Ramesh : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేశ్, తన తొలి సంతకం విశాఖలో లక్ష మందికి ఇళ్లు కట్టించే ఫైల్ పెట్టారు. రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టే బాధ్యత సీఎం తనకు అప్పగించారన్నారు.
![Minister Jogi Ramesh : మంత్రిగా తొలిసంతకం చేసిన జోగి రమేశ్, విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు Amaravati minister jogi ramesh taken charge fisrt sign on one lakh houses to women in Visakha Minister Jogi Ramesh : మంత్రిగా తొలిసంతకం చేసిన జోగి రమేశ్, విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/16/f9a8d79be8c39f4c4007be824fc18fe8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేశ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాకులో వేదపడింతుల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించేందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. అలాగే ఇప్పటి వరకూ గృహనిర్మాణ లబ్దిదారులకు ఇస్తోన్న 90 బస్తాల సిమెంట్ ను 140 బస్తాలకు పెంచిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గృహనిర్మాణ శాఖమంత్రిగా చేసి రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టించే బృహత్తరమైన బాధ్యతను అప్పగించారన్నారు.
లబ్దిదారులకు ఉచితంగా 140 సిమెంట్ బస్తాలు
విశాఖపట్నంలోని మహిళలకు ఇళ్లు కట్టించకుండా కొంతమంది చాలా కాలంగా అడ్డుపడుతున్నారని కానీ దానిపై కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో లక్ష మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఇప్పటి వరకూ గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇస్తోన్న 90 బస్తాల సిమెంట్ ను 140 బస్తాలకు పెంచడం వల్ల లబ్దిదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. నవరత్నాల్లో మేలిమి రత్నం గృహనిర్మాణ పథకమని అంతేగాక శాశ్వతమైనదని మంత్రి జోగి రమేశ్ అన్నారు. గతంలో కొద్దిమందికే ఇళ్లు ఇచ్చేవారని కానీ ఇవాళ కుల,మత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్క పేదవానికి ఇళ్లు నిర్మిస్తు్న్నామని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేడంతో పాటు తనను రాజకీయంగా ప్రోత్సహించిన దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
సీఎం జగన్ అభినవ ఫూలే
అంతేగాక సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం ఒక సామాజిక విప్లవవాదని, అభినవ పూలే, బీఆర్ అంబేద్కర్ కు అసలైన వారసుడు సీఎం జగన్ అని మంత్రి జోగి రమేశ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ గుప్త, తలసిల రఘురామ్, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మంత్రికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read : Acharya Jagan : ఒకే వేదికపై చిరంజీవి , జగన్ ! ఆ రోజు సంచలన ప్రకటన ఉంటుందా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)