Pawan Kalyan : యూనివర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారు- పవన్ కల్యాణ్
Pawan Kalyan : సీఎం జగన్ పుట్టినరోజు వేడుకులకు యూనివర్సిటీల్లో ఫ్లెక్సీలు కట్టడంపై పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా చేశారని విమర్శించారు.
Pawan Kalyan : ఏపీలో విశ్వవిద్యాలయాలు వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలకు యూనివర్సిటీల్లో ఫ్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించడంపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సామాజిక, రాజకీయ విషయాలపై చైతన్య వంతులను చేయాలని సూచించారు. అంతే కానీ అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేయకూడదన్నారు. ఏపీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ బాధ్యతను విస్మరించి వైసీపీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయని విమర్శించారు. యూనివర్సిటీలు అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని, సీఎం జగన్ ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేశారని ఆక్షేపించారు. ఇలాంటి తీరు విద్యార్థులకు, సమాజానికి ఏం సూచిస్తుందని ప్రశ్నించారు. ఫ్లెక్సీలతో పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని చెప్పిన సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు.
విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022
• ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోంది? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pvuJ7xLRA9
ఏయూ, ఏ.ఎన్.యూలో ఫ్లెక్సీలు
ఎంతో చరిత్ర కలిగిన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.ఆర్.రెడ్డి లాంటి గొప్పవారు వైస్ ఛాన్సలర్లుగా బాధ్యతులు నిర్వర్తించిన ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయం అన్నారు. ఈ యూనివర్సిటీ నుంచి ఎందరో మేధావులు వచ్చారని గుర్తుచేశారు. అలాంటి చోట రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫ్లె్క్సీలు కట్టించే వాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలని పవన్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లోనూ ఇదే తంతు కనిపిస్తోందన్నారు. యూనివర్సిటీల ఉపకులపతులకు వైసీపీ పట్ల ప్రత్యేక ప్రేమ, సీఎంపై అనురాగం ఉంటే వాటిని ఇంటికే పరిమితం చేసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్.
రాజమండ్రిలో జనసేన ఆందోళన
రాజమండ్రిలో ప్రైవేట్ స్థలాల్లో అధికారులు పెట్టిన ఫ్లెక్సీలపై జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించకపోతే ప్రభుత్వ స్థలం కింద భావిస్తామని ఫ్లెక్సీల్లో హెచ్చరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును జనసేన నేతలు ముట్టడించారు. పన్నుల పేరుతో ప్రభుత్వం ప్రైవేటు స్థలాలు కబ్జాకు ప్రయత్నిస్తుందని జనసేన ఆందోళన చేపట్టింది. కార్పొరేషన్ గేటు ఎదుట జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, జనసైనికులు బైఠాయించి ఆందోళన చేశారు. కార్పొరేషన్ కార్యాలయం గేట్లు వేసి జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్పొరేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలకి పన్నులు పేరుతో సామాన్యులను హెచ్చరిస్తూ ఆ స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామని మున్సిపల్ అధికారులు బోర్డులు పెట్టడాన్ని జనసేన నిరసించింది. ఈ మేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో (1/2) pic.twitter.com/zmp5fay7Ws
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2022