Pawan Kalyan : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్, ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక - పవన్ కల్యాణ్
Pawan Kalyan : పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక అని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.
Pawan Kalyan : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తుందని పవన్ అన్నారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు పట్టభద్రులు మార్గదర్శకులు అన్నారు పవన్. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలు పట్టభద్రులు తమ ఓటుతో కనువిప్పు కలిగించారన్నారు. ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు సందిగ్ధంలో ఉన్నవారికి ఓ దారి చూపించారన్నారు. ఏపీని అధోగతిపాల్జేస్తున్న వైసీపీకి పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏపీలో ఇలాంటి వ్యతిరేక ఫలితాలే ఉంటాయన్నారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
టీడీపీతో జనసేన జతకడుతుందా?
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై స్పష్టంగా కనపడే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా మూడు స్థానాలు గెలిచిన టీడీపీ హుషారుగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను చీలిపోకుండా చేయగలిగితే ప్రతిపక్షాలకు స్కోప్ ఉందనే నమ్మకం జనసేనకు వచ్చింది. పొత్తులపై అటు ఇటు ఆలోచిస్తున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు హుషారుగా జతకలిసే సమయం వచ్చింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉన్నా.. పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తామని ఇదివరకే చాలాసార్లు చెప్పింది. దమ్ముంటే ఒంటరిగా రండి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పండి అంటూ సవాళ్లు విసురుతున్నారు వైసీపీ నేతలు. వారు రెచ్చగొట్టినా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం విడివిడిగా ఎన్నిసీట్లలో పోటీ చేస్తామనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. బీజేపీ ఇంకా జనసేనతో పొత్తులోనే ఉన్నామంటోంది. జనసేనతో కలిపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, విజయం సాధిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. వారి సత్తా ఏంటో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయింది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత మాధవ్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. సో ఇక మిగిలింది టీడీపీ, జనసేన. జనసేనకు ఇప్పటికే బీజేపీ సత్తా ఏంటో ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ప్రతి ఉపఎన్నిక విషయంలో కూడా బీజేపీ తమ పంతమే నెగ్గించుకుంది కానీ పవన్ మాట వినలేదు. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా కూడా వద్దని వారించారు బీజేపీ నేతలు. ఇటీవల ఆవిర్భావ సభలో కూడా ఇవే విషయాలు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు పవన్. సో.. ఆయనకు టీడీపీతో కలిసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమనే చెప్పాలి.
జనసేనానికి టీడీపీతో కలవాలని ఉన్నా.. జనసైనికులకు మాత్రం ఎక్కడో కాస్త సంశయం ఉంది. టీడీపీతో కలిసి వెళ్తే లాభమా, టీడీపీతో ఉంటే పోటీచేసే సీట్ల విషయంలో కోతపడుతుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ పవన్ మాత్రం మొదటి నుంచీ ఒకేమాట చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తే విజయం మనదేనంటున్నారు. జనసేనకు నష్టం లేకుండా పొత్తుల గురించి ఆలోచిస్తామంటున్నారు. ఇప్పుడు టీడీపీ విజయం జనసేనలో కూడా హుషారుని తెప్పించింది.