Pawan On Crop Damage : అకాల వర్షాలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం, రైతాంగాన్ని ఆదుకోండి- పవన్ కల్యాణ్
Pawan On Crop Damage : అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టంపై పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని అధికారులను కోరారు.
Pawan On Crop Damage : ఏపీలో అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయన్నారు. ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న పవన్.... ప్రధానంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారన్నారు. ఈ సమయంలో వడగండ్లతో కూడిన వర్షాలు వారిని మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన చెందారు. రైతులకు తక్షణ ఆర్థిక సాయంతోపాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని కోరారు. పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు తన దృష్టికి వచ్చాయని పవన్ తెలిపారు. కళ్లాల మీద పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారన్నారు. ఈ దఫా ధర పెరుగుతోందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలిందన్నారు.
రైతాంగాన్ని ఆదుకోండి
"ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని మిర్చి రైతులు సైతం నష్టపోయారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మామిడి, మొక్క జొన్న, పొగాకు రైతులు పూర్తిగా దెబ్బ తిన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల మీద ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి లాంటి పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో వరి రైతులు తమ పంట అమ్ముకొనే సమయంలో..అకాల వర్షాలతో నష్టాల పాలయ్యారు. ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంట నష్టాల గణాంకాలను పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని అధికారులను కోరుతున్నాం. మా పార్టీ నాయకులకు సైతం క్షేత్ర స్థాయిలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించాను."- పవన్ కల్యాణ్
25 మండలాల్లో పంట నష్టం
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. ఈ హెచ్చరికలతో రైతులను మరింత ఆందోళన చెందుతున్నారు. ఏపీలో 25 మండలాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్టు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. అసెంబ్లీ మీడియా పోయింట్ వద్ద మాట్లాడిన ఆయన... అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారన్నారు. వారం రోజుల్లో పంట నష్టపరిహారంపై ప్రాథమిక అంచనా ఇవ్వాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. పంటలు చేతికి అందే సమయంలో అకాల వర్షాలు పడడం దురదృష్టకరమన్నారు. కర్నూలు, ఎన్టీఆర్, పార్వతీపురం, ప్రకాశం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వరి, మొక్కజొన్న, అరటి, మినుము, పత్తి పంటలు అకాల వర్షాలతో దెబ్బతిన్నాయని తెలుస్తోందని మంత్రి చెల్లుబోయిన అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నంద్యాల జిల్లాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో 5, కర్నూలులో 1, మన్యం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 1 ఇలా మొత్తం 25 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు స్పష్టం చేశారు.
వెంటనే ఎన్యుమరేషన్
రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం వైఎస్ జగన్ సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్ట పరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.