Pawan Kalyan On KGH Incident : అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వం, కేజీహెచ్ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్
Pawan Kalyan On KGH Incident : విశాఖ కేజీహెచ్ నుంచి బైక్ పై చిన్నారి మృతదేహాన్ని 120 కిలో మీటర్లు తరలించిన ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం కనీసం అంబులెన్స్ ఏర్పాటుచేయలేని స్థితిలో ఉందని మండిపడ్డారు.
Pawan Kalyan On KGH Incident : విశాఖ కేజీహెచ్ నుంచి చిన్నారి మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని సీఎం... విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కన్న బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలోమీటర్లు స్కూటీపై వెళ్లిన ఆ దంపతులకు సీఎం జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల తమ బిడ్డ చనిపోయిందన్న దుఃఖాన్ని దిగమింగి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లటం చూసి ఎవరికైనా గుండె బరువెక్కుతుందన్నారు. కానీ రాతి గుండె కలిగిన వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయం అందించేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఈ అమానవీయ ఘటన జరిగిందన్నారు.
డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే చాలదు
రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై ప్రభుత్వ అశ్రద్ధకు ఈ ఘటన నిదర్శనం అని పవన్ కల్యాణ్ అన్నారు. కొన్ని నెలల క్రితం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన కష్టాన్ని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. అలాగే మచిలీపట్నం బీచ్ లో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకెళ్లారని తెలిపారు. మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ ప్రశ్నించారు. బెంజిసర్కిల్‌లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసుకుని జెండా ఊపితే చాలదని పవన్ అన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని గొప్పలు చెప్పుకోవడం మాని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆ సేవలు అందేలా చేయాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మాయ మాటలతో ప్రజలను మోసం చేయడమా అని పవన్ మండిపడ్డారు.
మా నిర్లక్ష్యం లేదంటున్న కేజీహెచ్ వైద్యులు
బైక్ పై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై విశాఖ కేజీహెచ్ వైద్యులు వివరణ ఇచ్చారు. పాడేరు చెందిన దంపతులు చిన్నారి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడానికి సుమారు అరగంట సమయం పట్టిందన్నారు. గురువారం ఉదయం గం.7.50 లకు శిశువు చనిపోతే గం.8.30లకు తల్లిదండ్రులకు అప్పగించారు. వెంటనే గం.8.40లకు ఆసుపత్రిలోని ట్రైబల్ సెల్ వారికి కాల్ చేసి విషయం తెలియజేశామన్నారు. వారికి గం.9.15 లకు అంబులెన్స్ ఏర్పాటు చేశామని, ఈ లోపల గం.8.57లకు తల్లిదండ్రులు వినకుండా శిశువు మృతదేహాంతో ఆసుపత్రి నుంచి బయలుదేరిపోయారన్నారు. అయినప్పటికీ పాడేరులోని అధికారులకు విషయం తెలియజేసి, వైద్య సిబ్బందితో వారి ఆచూకీ కనుక్కొని అక్కడకు అంబులెన్స్ పంపామన్నారు. పాడేరు నుంచి వారి స్వగ్రామం కుమడకు అంబులెన్స్ లో వారిని పంపించామన్నారు. ఈ సంఘటన పూర్తిగా దురదృష్టకరమని, ఇందులో కేజీహెచ్ తరఫున ఎటువంటి నిర్లక్ష్యం లేదన్నారు. గిరిజన దంపతులకు అవగాహన లేకపోవటం వల్ల అంబులెన్స్ వచ్చే 15 నిమిషాల ముందే స్కూటీపై చిన్నారి మృతదేహం తీసుకెళ్లారని వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.