CM Jagan : ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను తొలగించి, వాలంటీర్లను భాగస్వాములు చేయండి- సీఎం జగన్
CM Jagan Review : వైఎస్సార్ యంత్ర సేవ కింద అందిస్తున్న పరికరాలు, యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.
CM Jagan Review : వ్యవసాయ అనుబంధ రంగాలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ...ఆర్బీకేల పరిధిలో వైఎస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా పోస్టర్లను రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను సీఎంకు అధికారులు అందించారు. రాష్ట్రంలోని 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ పూర్తి చేశామన్నారు. 1615 క్లస్టర్ లెవల్ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేశామన్నారు. రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించిందన్నారు. ఇందులో రూ. 240.67 కోట్ల సబ్సిడీ ప్రభుత్వానిదే అని తెలిపారు.
యంత్ర పరికరాల పంపిణీ
మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ పరికరాలను 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్ర పరికరాలు, మిగిలిన 20 శాతం మిగిలిన వారికి అందిచనున్నామన్నారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్బీకే యూనిట్‌గా పంపిణీ చేయాలన్నారు. దీనికోసం రూ.910 కోట్లు ఖర్చు ప్రభుత్వం చేయనున్నామన్నారు. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన
ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలన్నారు. పశువులను పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలన్నారు. దీని వల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతుందన్నారు. అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యంతో లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్నారు.
చిత్తూరు డెయిరీని పునరుద్ధరించండి
అమూల్ పాలసేకరణపైనా సీఎం జగన్ సమీక్షించారు. 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ పాల సేకరణ చేశామన్నారు. ఇప్పటి వరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ, పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లించామన్నారు. రైతులకు అదనంగా రూ.20.66 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్ పాలసేకరణ విస్తరించనున్నారని సీఎం జగన్ తెలిపారు. అమూల్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
ధాన్యం సేకరణపై
ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించి, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం కలగకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ పలు విధానాలపై కసరత్తు చేసింది. వీటిని సీఎంకు అధికారులు విధించారు. వాలంటీర్లను ధాన్యం సేకరణలో భాగస్వామ్యం చేయనున్నారు. వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు,ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని సీఎం జగన్ సూచించారు.