CM Jagan Review : మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan Review : మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
CM Jagan Review : మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్-3 ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 35,41,151 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం 376 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామన్నారు. సీఎం ఆదేశాలతో ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియామకాలను పూర్తిచేశామన్నారు.
మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రారంభించనున్న సీఎం. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో నిర్ణయం. pic.twitter.com/MSj7u7dMT1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 6, 2023
ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ
ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను నియమించుకున్నామని అధికారులు తెలిపారు. స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో ఉంచామని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 10,032 విలేజ్‌హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కు ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటారన్నారు. వీరితో పాటు ఒక సీహెచ్‌ఓ, 3-4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారని తెలపారు. విలేజ్ హెల్త్‌క్లినిక్స్, 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాలతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామన్నారు. 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామన్నారు. రోగులకు అందించే సేవలను రియల్‌టైంలో నమోదు చేసే ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ పూర్తిచేశామన్నారు. ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ విలేజ్‌క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఫ్యామిలీ డాక్టర్ విధులు
జనరల్‌ఓపీ, నాన్‌కమ్యూనికబుల్ వ్యాధులు, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్‌వాడీల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, వారి ఇళ్లకే వెళ్లి వైద్య సేవలు అందించడం, టెలీమెడిసిన్, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణించనున్నారు.
ఆరోగ్య శ్రీ సేవలు కూడా
ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగం కావాలని సీఎం జగన్ సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలపై ఎలాంటి ఫిర్యాదులున్నా చేయడానికి ఆరోగ్య శ్రీ కార్డులపై ఫిర్యాదు నంబర్ ఉండాలన్నారు. ఎనీమియా కేసులను సంపూర్ణ పోషణ ప్లస్‌తో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్‌ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.