Janasena : మంత్రులపై దాడి కేసులో జనసేన నేతలకు బెయిల్, హైకోర్టు తీర్పుపై పవన్ కల్యాణ్ హర్షం
Janasena : విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి ఘటనలో జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Janasena : విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులు, వైసీపీ నేతలపై దాడి కేసులో జనసేన నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దాడి ఘటనలో అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు 9 మంది జనసేన నేతలకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ విమానాశ్రయం ఘటనలో పోలీసులు మొత్తం 70 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 61 మందికి స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగిలిన 9 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉండడంతో స్థానిక కోర్టు వారికి రిమాండ్ విధించింది.
JanaSena Chief Sri @PawanKalyan:
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం. (1/2)
పవన్ కల్యాణ్ హర్షం
స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తాజాగా వారికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విశాఖ జైల్ లో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల అవ్వనున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు కేసులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా. రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. జనసేన నేతలకు బెయిల్ రావడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని పవన్ ఆరోపించారు. జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం అని పవన్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను ఎల్లప్పుడూ సంపూర్ణంగా విశ్వసిస్తానన్నారు. ఆ నమ్మకంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించామన్నారు. హైకోర్టుకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసులో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివ శంకర్, శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా. రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022
అసలేం జరిగింది?
విశాఖ జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ 15వ తేదీ సాయంత్రం నగరానికి వచ్చారు. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అయితే అదే రోజు మూడు రాజధానుల కోసం నిర్వహించిన విశాఖ గర్జనలో వైసీపీ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. గర్జన ర్యాలీ అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రులపై కొందరు దాడికి పాల్పడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేసిన ఘటనలో 92 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 71 మందిని పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 62 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఏ - 1, ఏ - 9 నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ను తీవ్రగాయం కేసుగా మార్చారు. అంటే సెక్షన్ 307 ను తొలగించి సెక్షన్ 326 గా మార్చారు. వీరికి మాత్రం కోర్టు రిమాండ్ విధించారు. మొత్తం తొమ్మిది మంది జనసేన నాయకులకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది కోర్టు. జనసేన నేతలు కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీను సెంట్రల్ జైల్ లో ఉన్నారు. వీరంతా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 9 మంది జనసేన నేతలకు బెయిల్ మంజూరు చేసింది.