AP Govt Employees : మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒకటో తేదీనే జీతాలు, ఉద్యోగులకు ఎందుకు చెల్లించడంలేదు - బొప్పరాజు
AP Govt Employees : ఇకపై ప్రభుత్వం ఇచ్చే హామీలు లిఖితపూర్వకంగానే ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
AP Govt Employees : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సంఘాల నేతలు పాల్గొన్నారు. అయితే ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పీఆర్సీ బకాయిలతో పాటు ఉద్యోగుల ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలన్నారు. మార్చి 9న జరిగే ఉద్యమకార్యచరణ యథావిధిగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ప్రస్తుత చర్చలపై ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒకటో తేదీనే జీతాలు
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు చెల్లించడంలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు టైంకు పింఛన్ ఇస్తున్నారని, మరి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా రాతపూర్వకంగా ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీతో భేటీ అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకూ నిరసన కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు ప్రకటించారు.
ఎందుకీ నిర్లక్ష్యం
"మా ఉద్యోగ , ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఏ కూడా మద్దతు ప్రకటించింది. జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలి. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే మా ఉద్యమం. డీఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదు. రిటైర్ అయిన వారికి బకాయిలు చెల్లించలేదు. ఏడాదిగా పోలీస్ లకు సరెండర్ లీవులకు చెల్లింపులు లేవు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేస్తే వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్ప ఏమి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు
క్రమబద్దీకరణ హామీని ప్రభుత్వం విస్మరించింది. ఎల్లుండి నుంచి స్వచ్ఛందంగా పాల్గొనాలి. మాలో ఐక్యత ఉందని చెప్పాలి. ఏపీ ఎన్జీఓ జేఏసీ కూడా భాగస్వాములు కావాలి." బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యమకార్యాచరణ
ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మార్చి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేయనున్నారు. 20వ తేదీ వరకూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తారు. 21వ తేదీ నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తారు. ఇందులో భాగంగా 21వ తేదీ అసలు సెల్ ఫోన్లు ఉపయోగించుకుండా విధులు నిర్వహిస్తారు. 24వ తేదీన కమిషనర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు. 27వ తేదీన కరోనా సమయంలో ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. కారుణ్య నియామకాలపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరిస్తారు. మూడో తేదీన స్పందన కార్యక్రమంలో ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఐదో తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణమయించారు.