Amaravathi : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని - ప్రజా తీర్పుతో క్లారిటీ !
Amaravathi is the Andhra Pradesh capital : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ప్రజలు కోరుకున్నారు. మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానుల నినాదానికి ప్రజల మద్దతు దక్కకపోవడమే దీనికి నిదర్శనం.
Andhra Pradesh Capital : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ?. గత ఐదేళ్లుగా వెంటాడిన ప్రశ్నకు ఎన్నికలు సమాధానం ఇచ్చాయి. అమరావతే రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి విజయం దక్కింది. మూడు రాజధానుల విధానంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ పరాజయం ఎదురైంది. అంటే .. రాష్ట్ర ప్రజలు అమరావతికే ఓటేశారని అనుకోవచ్చు.
గతంలో అమరావతికి అంగీకరించిన జగన్
అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజలు అంగీకరించలేదు. అధికారంలోకి రాక ముందు అమరావతిని రాజధానిగా జగన్ అంగీకరించారు. అసెంబ్లీలో కూడా మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో అమరావతే రాజధాని అన్నారు. తీరా గెలిచిన తర్వాత బోస్టన్ కమిటీ అని.. బొత్స కమిటీ అని.. దక్షిణాఫ్రికా అనే దేశంలో మూడు రాజధానులు ఉన్నాయని విధానాన్ని మార్చేసుకున్నారు. ఇది ప్రజల్ని వంచించడమేనన్న విమర్శలు వచ్చాయి. రైతుల్ని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. చివరిగా ఐదేళ్ల పాటు ఏ రాజధానినీ ఖరారు చేయలేకపోయారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల మాట
మూడు రాజధానులను నిర్ణయించినప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారని అనుకోవచ్చు. నిజానికి మూడు రాజధానుల ఎజెండాతో జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు. చట్టప్రకారం సాధ్యం కాదు అసెంబ్లీలో చట్టం చేసినా సాధ్యం కాదు.కానీ రైతులకు పరిహారం ఇవ్వడం ద్వారా మార్గం సుగమం చేసుకోవచ్చు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలి. రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించి రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. కానీ అలా చేయదల్చుకోలేదు కాబ ట్టి ఇంత కాలం పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందనుకోవచ్చు. అమరావతి రాజధాని పూర్తిగా చట్ట ప్రకారమే ఏర్పాటయింది.. అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. సుప్రీంకోర్టుకూ అఫిడవిట్ ద్వారా తెలిపింది. అయినా జగన్ మొండిగా ముందడుగు వేశారు.
సీమ నుంచే అమరావతి స్వరం వినిపించిన చంద్రబాబు
మూడు రాజధానుల విషయంలో చంద్రబాబునాయుడు రాయలసీమ నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కర్నూలు వెళ్లి అమరావతే మన రాజధాని అని ప్రకటించి వచ్చారు. తర్వాత విశాఖలోనూ అదే చెప్పారు. దీంతో ఇక టీడీపీ వాయిస్ పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో వైసీపీ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. విశాఖలో బహిరంగసభలు పెట్టినా జగన్ విశాఖ రాజధాని అని పెద్దగా చెప్పుకోలేకపోయారు. ఆ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చలేకపోయారు. మద్దతు రాదనే అలా చేశారు. చివరికి ప్రజలమద్దతు రాలేదు. ఆయన పార్టీ ఓడిపోయింది. ప్రజలు అమరావతికే ఓటేశారు. ఇక ఏపీ రాజధానిపై ఉన్న అపోహలన్నీ పటాపంచలు అయినట్లే.
అమరావతినే రాజధాని అంటున్న టీడీపీ ఇప్పుడు ఐదేళ్లలో దాన్ని పూర్తి చేసి చూపించాల్సిన అవసరం పడింది.