Budget Allotments To AP: పోల'వర'మిచ్చారు - విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టుకు అధిక నిధులు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇలా!
Andhra News: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ సహా విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు.

Budget Allocations To AP In Union Budger 2025 - 26: కేంద్ర బడ్జెట్ 2025 - 26ను (Union Budger 2025) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట కల్పించడం సహా రైతులు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. భారీ ఆదాయాన్ని వదులుకొని రూ.12 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు కల్పించింది. అటు, ఏపీకి సైతం వరాల జల్లు కురిపించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు సహా విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన వివరాలు ఓసారి పరిశీలిస్తే..
- పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయింపు. ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలిపింది.
- పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
- విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
- రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
- లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు
- రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
- రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
- అలాగే, ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు.
మోదీ వికసిత్ భారత్ దార్శనికత
కేంద్ర బడ్జెట్ 2025ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్య తరగతి, వేతన జీవులు వెన్నెముక వంటి వారని.. అలాంటి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలమ్మ ప్రవేశపెట్టారని అన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని.. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని చెప్పారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని పేర్కొన్నారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఆ నిర్ణయం చారిత్రాత్మకం
కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ నిర్ణయంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అంటూ గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేస్తూ విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణం. జల్ జీవన్ మిషన్ పనులను 2028 వరకూ పొడిగించారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. దీని ద్వారా ఏపీకి ప్రయోజనాలు దక్కనున్నాయి. ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగించడంపై ధన్యవాదాలు.' అని రామ్మోహన్ పేర్కొన్నారు.





















