Diversion Politics : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?
నిన్నామొన్నటిదాకా డ్రగ్స్ అంశం రాజకీయంగా కలకలం రేపగా ఇప్పుడు బూతులే హాట్ టాపిక్ అయ్యాయి. వ్యూహాత్మకంగా తమకు ఇబ్బంది లేకుండా బూతుల అంశాన్ని అధికార పార్టీ తెరపైకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలను ఎవరూ అర్థం చేసుకోలేనంత స్థాయికి దిగజారిపోతున్నాయి. డ్రగ్స్ ఇష్యూ నుంచి హఠాత్తుగా వ్యవహారం ఒకరినొకరు దారుణంగా తిట్టుకునే పరిస్థితికి చేరింది. ఈ అంశంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌గా విమర్శించడం ప్రారంభించాయి. డ్రగ్స్, గంజాయి వ్యవహారంలో అధికారం పార్టీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఈ విషయం బయట పడకుండానే .. తమ పార్టీ నేతలతో పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
బూతులతో పక్కకుపోయిన డ్రగ్స్ స్మగ్లింగ్ అంశం
వారం రోజుల కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం కీలకంగా ఉంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ. వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడటం.. ఆ సరుకు దిగుమతి చేసుకుంది విజయవాడలో రిజిస్టరయిన కంపెనీ కావడంతో వివాదం ప్రారంభమయింది. ఆ సంస్థ పట్టుబడటానికి ముందే పెద్ద ఎత్తున హెరాయిన్ దిగుమతి చేసుకుని ఏపీలో జీఎస్టీ కూడా కట్టిన విషయాన్ని టీడీపీ బయట పెట్టింది. ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ నుంచి తెలంగాణకు రవాణా చేస్తున్నగంజాయిని సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు దొరికినా లాబీయింగ్ చేయించుకుని కేసు లేకుండా చేసుకున్నారని టీడీపీ ఆరోపణలు ప్రారంభించారు. సవాళ్లు కూడా చేసుకున్నారు. అయితే ఈ అంశం ఒక్క సారిగా తెర వెనక్కి వెళ్లిపోయింది.
Also Read : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?
పోసాని బూతులపై ఇప్పుడు అంతా చర్చ
ఏపీలో టీడీపీ - వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య డ్రగ్స్ పై విమర్శలు - ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ..సినిమా ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కల్యాణ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వైల్డ్‌గా టార్గెట్‌గా చేశారు. బూతులు తిట్టడం ప్రారంభించారు. ఈ అంశంలోకి జగన్ అభిమానిని అంటూ తెర ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి తిట్టిన బూతులకు అంతే లేకుండా పోయింది. చివరికి పవన్ కల్యాణ్ మైనర్ కూతురిపై కూడా ఆయన అసభ్య వ్యాఖ్యలు , బెదిరింపులు చేశారు. దీంతో ఇది నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. డ్రగ్స్ అంశం తెర వెనక్కి వెళ్లిపోయింది.
Also Read : 'అన్నీ కుదిరితే ఎమ్మెల్యే అవుతా'.. ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పెడతారా?
వ్యూహాత్మకంగా సమస్యను డైవర్ట్ చేస్తున్నారన్న టీడీపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పవన్ కల్యాణ్‌పై అందుకే విరుచుకుపడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ... జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్‌గా వచ్చారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారిందని మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ధరలు పెంచడం, దోపిడీ పాల్పడటం వంటి వాటితో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు.
Watch Video : రేయింబవళ్లు శ్రమించినా.. నేతన్నలకు తప్పని ఆందోళన
డ్రగ్స్ స్మగ్లింగ్‌లో వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు
డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయన్న ఆరోపణలు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర చేశారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ మూలంగా మారిందన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారని గుర్తు చేశారు. కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పమహ్మద్ ఆలిషాకు వైసీపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయంపై కూడా విచారణ చెయ్యాలని కనకమేడల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాపియాలో కాకినాడకు చెందిన ప్రజాప్రతినిది ఉన్నారని విచారణ జరిపించాలని డిమాడ్ చేశారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు జనసైనికులు, మంత్రులు, పోసాని పావులుగా మారారని ఆరోపించారు.
Also Read : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి