Food Poison: ఫుడ్ పాయిజన్ - 52 మంది విద్యార్థులకు అస్వస్థత, ఎక్కడంటే?
Konaseema News: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
Gurukul Students Food Poisoning in Konaseema District: డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లా రామచంద్రాపురం (Ramachandrapuram) మండలం ద్రాక్షారామం సమీపంలోని ఆదివారపుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 460 మంది విద్యార్థులు హాస్టల్ లో ఉండగా ఆదివారం భోజనం తిన్న అనంతరం 52 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని స్థానిక వైద్యులతో విద్యార్థులకు స్కూల్లోనే వైద్య సహాయం అందజేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని DMHOను ఆదేశించారు. దీంతో నలుగురు వైద్యులతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. 8 మందికి పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆ విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్థులందరి పరిస్థితి నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు వెళ్లి తమ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.