Chandrababu Letter To AP CS: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోండి, ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.
రైతులను ఆదుకోండి.. సీఎస్ కు చంద్రబాబు లేఖ..
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. మార్చిలో కురిసిన వర్షాలకు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయిని, గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట దెబ్బతిన్నదని చంద్రబాబు తెలిపారు. కళ్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిచిపోయిందని,మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారని పేర్కొన్నారు.
ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరపపంట దెబ్బతిన్నదని, కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయిందని వివరించారు. అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం చెందడం బాధాకరమని ఆవేద వ్యక్తం చేశారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలని ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.
చంద్రబాబు సభలో ఏమైనా జరిగితే డీజీపీదే బాధ్యత.. వర్ల
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సీఎం జగన్, ఆయన ప్రభుత్వం వాటి నిర్వహణలో విఫలమయ్యారని.. వాటిని ఎలా కాపాడాలో వారికి తెలియడంలేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య. ఇష్టమున్నవాళ్లను దగ్గరకు తీస్తా.. ఇష్టంలేని వారిని తొక్కి అవతల పడేస్తానన్న ముఖ్యమంత్రి విధానం పాలెగాళ్ల పాలనకే పరిమితం అన్నారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజాస్వామ్యబద్ధంగానే నడవాలన్న ఆలోచనను విస్మరించరని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా నడవడానికి వీల్లేదన్న వాస్తవం ముఖ్యమంత్రికి తెలియకపోవడమే శాంతిభద్రతల లేమికి ప్రధాన కారణమని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారులు వారి బాధ్యతల్ని విస్మరించారని, చట్టపరంగా, న్యాయ బద్ధంగా ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం పనిచేయడం మర్చిపోవడం చాలాబాధాకరమన్నారు.
పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ముఖ్యమంత్రి జగన్ నా ఇష్టమంటుంటే, మంత్రులు ఆయనకు, సజ్జలకు భయపడి వారేం చెబితే అదే కరెక్టే అనే స్థితికి వచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తెలియని సజ్జల లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని శాసిస్తూ పరిపాలిస్తున్నారు, కాబట్టే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పాయన్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని సంకట స్థితిలో పోలీస్ శాఖ ఉందిని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటనలో శాంతిభద్రతల వైఫల్యం తలెత్తితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే బాధ్యత అవుతుందని వర్ల రామయ్య అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో చిన్న అపశ్రుతి తలెత్తినా, డీజీపీ పై హైకోర్ట్ లో రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు. విధినిర్వహణ డీజీపీకి తెలిసొచ్చేలా చేస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబుని వైజాగ్ విమానాశ్రయంలో ఎలా అడ్డుకున్నారో.. అనపర్తిలో 7కిలోమీ టర్లు ఎందుకు నడిపించారో, యర్రగొండపాలెంలో ఎలా ఫెయిల్ అయ్యారో అన్నింటినీ ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచుతాం అన్నారు. RRR సినిమా నటుల ప్రదర్శన ఆస్కార్ కు వెళ్లినట్టు, డీజీపీ పని తీరు హైకోర్టు ముందు ఉంటుందని ఎద్దేవా చేశారు. హైకోర్ట్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించాకైనా ఆయన తన పనితీరు మార్చుకుంటారా లేకుంటే, డీజీకి ఆఖరి అవకాశమని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు పర్యటన సజావుగా, సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత డీజీపీదేనని, పరిస్థితి హైకోర్టు వరకు తెచ్చుకోవద్దని కూడా డీజీపీకి హితవు పలికారు. ఏకపక్షంగా వెళ్లమని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ కు కూడా డీజీపీ తన బాధ్య తలు, విధినిర్వహణ ఏమిటో చెబితే ఆయనకే మంచిదన్నారు.