PM Fasal Bima Yojana: మీరు పంట నష్టపోతే ప్రభుత్వమే ఆ లాస్ భరిస్తుంది, ఈ నెల 31 వరకే రబీ రిజిస్ట్రేషన్లు
దురదృష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పథకం మీకు అండగా ఉంటుంది, ప్రస్తుతం, పీఎం ఫసల్ బీమా యోజన కింద రబీ పంటలకు బీమా చేస్తున్నారు.
PM Fasal Bima Yojana: వ్యవసాయ ఒకప్పుడు పండగ, ఇప్పుడు దండగ. 40, 50 ఏళ్ల క్రితం వరకు... బాగా చదువుకున్న వాళ్లు కూడా వ్యవసాయాన్ని నమ్ముకుని సొంత ఊళ్లలోనే దర్జాగా బతికారు. ఇప్పుడు... పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర దొరక్క రైతులు కాడిని వదిలేస్తున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో, చేలను వదిలేసి బీళ్లుగా మార్చేస్తున్నారు.
దేవుడి మీద భారం వేసి సాగు చేస్తున్న రైతులు నానా కష్టాలు పడుతున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు కొనడం, విత్తడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు & పురుగుమందుల కొనుగోళ్లు, కోతలు కోయడం, దిగుబడిని మార్కెట్ తరలించేందుకు రవాణా ఖర్చులు, అక్కడ దళారీలకు అదనంగా చెల్లించడం... ఎన్నెన్నో రూపాల్లో రైతులు ఇతర ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులన్నీ కలిపి చూస్తే, రైతులు ఒక సీజన్‌లో పంటను పండించడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది.
పీఎం ఫసల్ బీమా యోజన
ఇదిలా ఉంటే... వర్షాలు, వరదలు, తుపాన్లు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల, చేతికి రాకముందే పంటలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భారీ నష్టం వస్తుంది. రైతుల మీద అప్పుల భారం పెరుగుతుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజనను (PM Fasal Bima Yojana) ప్రారంభించింది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద, రైతులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. మీరు ఫసల్ బీమా పథకం కింద బీమా పంటకు బీమా చేయించినట్లయితే... దురదృష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పథకం మీకు అండగా ఉంటుంది.
ప్రస్తుతం, పీఎం ఫసల్ బీమా యోజన కింద రబీ పంటలకు బీమా చేస్తున్నారు. దీని కోసం 2022 డిసెంబర్ 31 నాటికి ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలి.
వర్షం, వరదలు, తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ పంటలు దెబ్బతింటే.. ఆ నష్టం గురించి అధికారులకు మీరు 72 గంటల్లో తెలియజేయాలి. వ్యవసాయ శాఖ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి గానీ, ఈ-మెయిల్ ద్వారా గానీ, వ్యవసాయ కార్యాలయానికి స్వయంగా వెళ్లి గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ పంట నష్టం సమాచారం మీరు అందించవచ్చు. ఖరీఫ్, రబీ, వాణిజ్య/ఉద్యాన పంటలకు బీమా ప్రీమియాన్ని వరుసగా 2, 1.5 & 5 శాతంగా నిర్ణయించారు.
ఏ రైతులకు లబ్ధి చేకూరుతుంది?
పీఎం ఫసల్ బీమా యోజన కింద పేరు నమోదు చేసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులు అందరినీ ఈ పథకం లబ్ధిదార్లుగా గుర్తిస్తారు. సహకార బ్యాంకు లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి రుణం తీసుకున్న రైతులు ఆటోమేటిక్ బీమా పొందుతారు. బీమా మొత్తం ఉపసంహరించిన తర్వాతే ఆయా రుణాలు వాళ్లకు అందుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉండి, సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
ఏ పరిస్థితుల్లో బీమా ఇస్తారు?
తక్కువ వర్షం కారణంగా, ప్రతికూల వాతావరణం కారణంగా విత్తడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా ప్రయోజనం అందుతుంది
సాగు సమయంలో వర్షం, వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే పంట నష్టానికి బీమా ప్రయోజనం
తుపాను, అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటకు పంటకు పరిహారం అందజేస్తారు