Adilabad Tribal Festival Bud Baave | వర్షాల కోసం ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీలు ఏం చేస్తారంటే.?
ఆదివాసీల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేక సంప్రదాయం.. ఆచారం.. ఉంటుంది. అందులో భాగంగానే ఏటా వేసవి కాలం చివరి అమావాస్య నాడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో వర్షాల కోసం "బుడ్ బావే.. పెర్సా బావే" అనే కార్యక్రమం చేస్తుంటారు. ఈ ప్రత్యేక ఆచారం ఏంటి, ఈ వేడుకలో ఏం చేస్తారు.
ఏటా వేసవికాలం పూర్తై, వర్షాల కోసం ఎదురు చూసే ఆదివాసీలు.. ఆ సమయంలో తమ పొలాలను దున్ని, చదును చేసి, విత్తనాలు నాటడానికి సిద్ధమవుతారు. కానీ వర్షాలు ఎప్పుడొస్తాయి, రుతుపవనాలు ఎటు నుంచి వస్తాయనే వివరాలు తెలిపేది మాత్రం ఈ "బుడ్ బావే.. పెర్సా బావే" వేడుక అంటారు ఆదివాసీలు. దీనికోసం ముందుగా గ్రామ పెద్దలంతా కలసి తమ గ్రామ పోలిమేరలో ఓ చెట్టు వద్ద "విజంగ్" అనే కార్యక్రమాన్ని చేస్తారు. అందరూ తమ తమ ఇళ్ల నుంచి కొన్ని విత్తనాలు తెచ్చి, గ్రామ పటేల్ ఆధ్వర్యంలో పూజారి చెట్టు కింద తమ వన దేవతకు పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లిస్తారు. ఆ విత్తనాలను ఆకుల్లో భద్రపరిచి తమ ఇంటి దేవతల వద్దకు తీసుకువచ్చి మొక్కలు చెల్లిస్తారు. అక్కడే సహపంక్తి భోజనాలు చేసి, సాయంత్రం తమ ఇళ్లకు చేరుకుంటారు. కొంతమంది పిల్లలు, పెద్దలు అడవిలోకి వెళ్లి వేసవిలో పూసిన రేలా పుంగార చెట్టు పువ్వులను తీసుకొస్తారు.