PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desam
భారత్, శ్రీలంకల్లో జరిగే 2026 టీ20 వరల్డ్ కప్‌ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్టు... బీసీసీఐని హెచ్చరించినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2025లో పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లబోదని వార్తలు వస్తున్నాయి. భారత్ మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లేదా శ్రీలంకల వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ... ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది.
జులై 19 నుంచి 22 వరకు శ్రీలంకలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నారట. ఒకవేళ ఈ అంశం చర్చకు వస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే జరిగి తీరేలా హైబ్రిడ్ పద్ధతిని వ్యతిరేకించాలని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు రాకపోతే... పాకిస్తాన్ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాకూడదని నిర్ణయించుకుందట.
2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆడకపోతే ఆ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. టీమిండియా చివరిసారిగా 2008 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌లో ఆడింది. అనంతరం రెండు జట్లూ కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పోటీ పడ్డాయి.