Virat Kohli IPL 2025 Trophy Celebrations | 18ఏళ్ల కలను ఫుల్ గా ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ
ఎవరైనా ఓ కోరిక కోరుకుని 18ఏళ్ల పాటు అది నెరవేరకుండా ఉంటే ఎలా ఉంటుంది. విరాట్ కొహ్లీనే అడిగితే చెప్తాడు. టీమ్ కోసం ఎంతో చేసినా ఎన్నో వేల పరుగులు అందించినా సరే ఆర్సీబీకి ఒక్క కప్పు అందించకపోయాననే వేదన ఇన్నాళ్లూ కోహ్లీని వెంటాడింది. ఇక అది తీరిపోయిన క్షణం మొదట భావోద్వేగానికి లోనైన కోహ్లీ కప్పు అందుకున్న క్షణం మాత్రం చిన్న పిల్లాడిలా మారిపోయాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కప్పు అందుకుని తీసుకుని రాగానే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఆర్సీబీ...ఆ తర్వాత కోహ్లీ చేతికి కప్పును అందించి గౌరవించింది టీమ్. ఇక అంతే ఆ కప్ ను ముద్దు పెట్టుకుని సింహంలా గర్జించాడు విరాట్ కోహ్లీ. ఇన్నేళ్లు కసి బాధ ఆవేదన అంతా మర్చిపోయేలా సింహనాదాలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ బోర్డ్ ముందు కప్ పెట్టి దాని పక్కనే తను కూర్చుని అబ్బో చిన్న పిల్లాడిలా గంతులేశాడు కోహ్లీ. ఆ కప్ పట్టుకుని గ్రౌండ్ మొత్తం కలియ తిరుగుతూ రచ్చ రచ్చ చేశాడు. అభిమానులకు కప్ చూపిస్తూ మనం సాధించాం అంటూ అందరిలోనూ జోష్ నింపిన కోహ్లీ….సుదీర్ఘ పోరాటం తర్వాత ఐపీఎల్ కప్ సాధించి తను చేయాలి అని అనుకున్నవ్నీ చేసేశాడు. అన్ని రకాల ట్రోఫీలతో తన క్రికెటింగ్ కెరీర్ ను కూడా సంపూర్ణం చేసుకున్నాడు.





















