MS Dhoni IPL Retirement | కెప్టెన్ ధోనీ శకం ఇక ముగిసినట్లేనా..? | ABP Desam
ఐపీఎల్ లో ఇక ఎమ్మెస్ ధోనీ శకం ముగిసిందా. 2008 లో ఐపీఎల్ ప్రారంభించిన సమయం నుంచి ఇప్పటి వరకూ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ..తన 44వ ఏట ఈ రోజు కెప్టెన్ గా చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ పై ఆడాడు. ఈ సీజన్ లో రుతు రాజ్ కు గాయం కావటంతో సీజన్ మధ్యలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న ధోనీ… టీమ్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశ ముగించుకుని వెళ్తూ వెళ్తూ టాప్ 1 జట్టుగా ఉన్న గుజరాత్ కి పవర్ పంచ్ ఇచ్చాడు. టాప్ 2 లో గుజరాత్ ప్లేస్ కన్ఫర్మ్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ను విజయం దిశగా నడిపించిన ధోనీకి బహుశా కెప్టెన్ గా ఇదే ఆఖరి మ్యాచ్. నాయకుడిగా ఇదే ఆఖరు. మరి ఆటగాడిగా..? ఈ సందేహం కూడా ఉంది ధోనీ అభిమానుల్లో. ఎందుకంటే వచ్చే ఏడాది ఐపీఎల్ టైమ్ కి 45ఏళ్లు వస్తాయి. ఇప్పటికే తనువెల్లా గాయాలతో కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్న ధోనీ ఏడాదిలో రెండు నెలలు ఐపీఎల్ ఆడుతూ తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి అండగా నిలబడుతున్నాడు. కానీ ఈసారి అటు బ్యాటర్ గా, ఇటు కెప్టెన్ గా నూ మాహీ విఫలం అవటంతో ఇక ధోనీ కెరీర్ ముగిసిపోయినట్లే అంటున్నారు. కానీ ధోనీ మాత్రం మ్యాచ్ తర్వాత భిన్నంగా స్పందించాడు. తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇప్పుడే కంగారు లేదు అన్నాడు. తన దగ్గర చాలా టైమ్ ఉందని 4-5 నెలల తర్వాత తన బాడీ ఫిట్ గా ఉంటే మళ్లీ రావొచ్చని అలా వస్తానని కచ్చితంగానూ చెప్పలేనంటూ ట్విస్ట్ ఇచ్చాడు. తనలో ఇంకా టైమింగ్ మిగిలే ఉందన్నాడు. వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ మాటే ఆ శాసనం. సీఎస్కే హోల్డింగ్ కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్ కి ధోనినే వైస్ ప్రెసిడెంట్. ఓ రకంగా అది తన సొంత జట్టులా అన్ని విషయాల్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషించే ధోనీ శరీరం వచ్చే ఏడాదికి అనుకూలంగా లేకపోతే ఆడలేనని హింట్స్ ఇచ్చాడు. ఆడేది రెండు నెలలే కాబట్టి ప్రతీసారి తనకు సీజన్ ముగిసిన తర్వాత 6-7 నెలల సమయం ఉంటుందని ఆ తర్వాతే చెబుతానని చెప్పటం ధోనీకి అలవాటు. ఈసారి కూడా అలాగే చెప్పాడు. తన 18ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ 278 మ్యాచుల్లో 5వేల 439 పరుగులు చేశాడు. అందులో 24 హాఫ్ సెంచరీలున్నాయి. 7-8 పొజిషీన్స్ లో ఆడే మరే ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ ఇది. ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, డెవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, అన్షుల్ కాంభోజ్ లాంటి కుర్రతరం ఆటగాళ్లకు ఈసారి ఛాన్సులు ఎక్కువగా ఇచ్చిన ధోనీ తన మైండ్ లో ఈపాటికే నెక్ట్స్ ఇయర్ టీమ్ డిసైడ్ అయిపోయి ఉంటాడు. తన అవసరం ఉందని అనిపిస్తే వస్తాడు లేదంటే ఈరోజు ఆడిందే ఆఖరి మ్యాచ్ అని ఓ ఏడాది తర్వాత చిన్న ట్వీట్ వేస్తాడు కాబట్టి ఇవాళే చెబుతున్నాం ఇదే ధోనీ ఆఖరి మ్యాచ్ కావొచ్చు. ఓ మాట మాత్రం నిజం..ఎంతో మంది క్రికెటర్లు వస్తుంటారు ఈ గేమ్ ను ఏలుతుంటారు పోతుంటారు కానీ... ధోని లాంటి క్రికెటింగ్ బుర్ర ఉన్న..కూల్ కెప్టెన్..మాస్టర్ మైండ్ మరొకడు రాడు రాబోడు.





















