Vizag Sampath Vinayaka Temple Vinayaka Chavithi 2025 Special | ఈ వినాయకుని విగ్రహం పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచేసిందా? | ABP Desam
అది 1971 సంవత్సరం. ఇండియా - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఆ సమయంలో తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తరువాత కొద్దిరోజులకే విశాఖ పై దాడికోసం రహస్యంగా వచ్చిన పాకిస్తాన్ సబ్ మెరైన్ PNS ఘాజీ 4 డిసెంబర్ 1971న సముద్రంలోనే పేలి, మునిగిపోయింది. దానితో స్వామి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్ మెరైన్‌ని ముంచెయ్యగలిగామని భావించిన కృష్ణన్ విశాఖ లో ఉన్నంత వరకూ ప్రతీరోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లే వారట. ఆ ఘటన తరువాత వైజాగ్ లోని సంపత్ వినాయక్ ఆలయం పాపులారిటీ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడింది అంటారు విశాఖ వాసులు.
తమిళ వ్యాపారులు ఏర్పాటు చేసిన వాస్తు గణపతే - ఈ సంపత్ వినాయకుడు :
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల ‘‘సంపత్ వినాయక’’ లేదా “శ్రీ సంపత్ వినాయగర్” ఆలయం తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నగా ఉంటుంది. బొజ్జ గణపయ్య కొలువుతీరిన అతి బుల్లి ఆలయంగా దీన్ని చెప్పొచ్చు.. ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని, సకల సంపదలూ అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయాన్ని, ముగ్గురు ఒకే కుటుంబీకులు కలిసి కట్టించారు. తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తు దోష నివారణ కోసం వ్యక్తిగతంగా నిర్మించిన మందిరం “సంపత్ వినాయక” ఆలయం.విశాఖపట్నంలోని ఆసిల్ మెట్ట వద్ద ఉన్న ఈ ఆలయం S.G. సంబందన్ & కో. వారికి చెందినది.





















