Visakhapatnam Bellam Vinayaka Temple | బెల్లాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరించే బెల్లం వినాయకుడు | ABP Desam
తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది. కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేధ్యంగా చెల్లిస్తుండడంతో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది. నిజానికి ఆ వినాయకుడి పేరు ఆనందగణపతి. వైజాగ్ లో కేజీహెచ్ పక్కనుండి వెళితే కొత్త జాలరి పేట వస్తుంది. ఆ పేటలో సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం చిన్నదైనా.. దీని నిర్మాణంలో చోళుల శిల్పకళ ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్రతీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది.. ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రానురానూ బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి మిగిలిపోయింది. ఇక్కడి వినాయకుడి వద్దకు వచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన వెంటనే బెల్లం దిమ్మలు తెచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించాల్సిందే. ఇక్కడ స్వామికి నైవేద్యమూ, భక్తులకు ప్రసాదమూ .. రెండూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్ళేదారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది అంటారు ఇక్కడి స్థానికులు. విశాఖలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు. ఒకటి సిరిపురం లోని సంపత్ వినాయక్ టెంపుల్ అయితే.. రెండోది క్రొత్త జాలరిపేట లోని బెల్లం వినాయకుని గుడి. ఈ రెండింటి లోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైంది. ఆ మధ్యకాలంలో దీని ప్రశస్తి మరుగునపడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్ళీ ప్రాముఖ్యత పెరిగింది అని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.





















