Shubanshu Shukla First Speech from ISS | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాన్షు తొలి సందేశం | ABP Desam
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా తొలిసారిగా మాట్లాడారు. బ్యాడ్జ్ నెంబర్ 634 ను కమాండర్ ఇన్ చీఫ్ పెగ్గీ వాట్సన్ శుభాన్షుకు అందించారు. ఆ తర్వాత భారత దేశ ప్రజల కోసం శుభాన్షు హిందీలో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హిందీలో మాట్లాడిన తొలి వ్యక్తిగానూ...ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగానూ శుభాన్షు రికార్డులకెక్కారు.
"నా ప్రియమైన దేశ ప్రజల కోసం ఓ చిన్న సందేశం ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కారణంగానే నేను ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు సురక్షితంగా చేరుకున్నాను. చూడటానికి తేలుతున్నట్లు ఉంది కానీ నిలబడటానికే కష్టంగా ఉంది. నా తలంతా భారంగా ఉంది. కానీ ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కొద్ది రోజులు గడిస్తే ఈ పరిస్థితులకు మేం అలవాటు పడిపోతాం. ఇది ఆరంభం మాత్రమే. రానున్న 14రోజులు మనం ఇక్కడ చాలా ప్రయోగాలు చేస్తాం. సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మన దేశ అంతరిక్ష ప్రయాణానికి ఇది ఆరంభం అని చెప్పుకోవచ్చు. నేను డ్రాగన్ క్యాప్సూల్ లో ఉన్నప్పుడు మాట్లాడాను. రానున్న రోజుల్లో కూడా మనం మాట్లాడుకుంటూనే ఉందాం. రండి కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నా భుజంపై మన దేశ త్రివర్ణ పతాకం ఉంది. అంటే మీరంతా నాతో ఉన్నారనే అర్థం. రానున్న 14రోజులు చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ధన్యవాదాలు. జైహింద్. జై భారత్" - శుభాన్షు శుక్లా, ఇస్రో ఆస్ట్రోనాట్





















