యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఫైనల్ ఫేజ్‌కి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ క్రమంలోనే అటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ కమలా హారిస్ పోటీ పడి మరీ క్యాంపెయిన్ చేస్తున్నారు. ట్రంప్ అయితే..ఏకంగా రెస్టారెంట్‌లలోకి వెళ్లి పిజ్జాలు సర్వ్ చేస్తున్నారు. అటు కమలా హారిస్ కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. అయితే..ఈ ప్రచారం కోసం వాళ్లు చేస్తున్న ఖర్చుల లెక్కలు చూస్తుంటే...కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కేవలం యాడ్స్ కోసమే ఓ రేంజ్‌లో డాలర్లు గుమ్మరిస్తున్నారు ఈ ఇద్దరు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కి ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే..గత నెల కమలా హారిస్ ప్రచారం కోసం 270 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
అంటే మన కరెన్సీలో 2 వేల కోట్లకు పైమాటే. కాస్త డ్రమటిక్‌గా చెప్పాలంటే...మన బాహుబలి సినిమాకి వచ్చిన కలెక్షన్ అంత. వీటిలో ఎక్కువ మొత్తం టీవీ యాడ్స్ కోసమే ఖర్చు చేశారు కమలా. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే...గత నెల ఆయన ప్రచారం కోసం 78 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. కమలా హారిస్‌తో పోల్చి చూస్తే ఈ విషయంలో వెనకబడ్డారు ట్రంప్. ఈ ప్రచార ఖర్చుల కోసం ఇద్దరూ పోటీ పడి మరీ విరాళాలు సేకరించారు. కమలా హారిస్ 222 మిలియన్ డాలర్లు సేకరించగా..ట్రంప్ 63 మిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే..ఈ సారి అమెరికా ఎన్నికలు ఎంత ఖరీదైనవో అర్థమవుతోంది.