Shubhanshu Shukla Reunited With Family | ఫ్యామిలీని కలుసుకున్న శుభాన్షు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులపాటు గడిపి సురక్షితంగా భూమిదకు చేరుకున్న శుభాన్షు శుక్లా తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని రిహాబిలిటేషన్ సెంటర్లో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటోలను శుభాన్షు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
" అంతరిక్షయానం అద్భుతం. కుటుంబ సభ్యులను చాలా రోజుల తర్వాత కలుసుకోవడం కూడా అంతే అద్భుతమని శుభాంశు శుక్లా తన ఇంస్టా పోస్ట్ లో పేర్కొన్నారు. అంతరిక్షయానం కోసం రెండు నెలలు క్వారంటైన్‌లో గడిపాను. ఈ సమయంలో 8 మీటర్ల దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. తన చేతులకు జెర్మ్స్ ఉంటాయి కాబట్టి నను ముట్టుకోవడానికి వీలుండదని నా కొడుకుకు చెప్పాల్సి వచ్చింది. నన్ను చూడడానికి వచ్చిన ప్రతి సారి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చా అని నా కొడుకు తన అమ్మని అడిగే వాడు. ఇది అంత చాలా చల్లేంజింగ్ గా అనిపించింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తున్నదని అన్నారు శుక్లా. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం, మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన వారిని మర్చిపోతుంటామని... ఈరోజు తనకి ఎంతో ఇష్టమైన వారిని కలిశానని అన్నారు. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయని, మనుషుల వల్లే అవి అలా మారాయని శుభాన్షు పోస్టు చేశారు.
అంతరిక్షయానం తర్వాత శుభాన్షు తమని కలవడమే అతిపెద్ద సెలబ్రేషన్ అని తెలిపారు భార్య కమ్నా. అంతరిక్షంలో ఉన్నప్పుడు తను ఇంటి భోజనం మిస్ అయ్యారని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాని అన్నారు.





















