Ramoji Rao Passed Away | నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు
మీడియా దిగ్గజంగానే కాదు విలువలు కలిగిన సినీ నిర్మాతగానూ రామోజీ రావు తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఈ రోజు RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సాధించిన జూనియర్ ఎన్టీఆర్, రౌడీ బాయ్ గా నేటి తరం ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్న విజయ్ దేవరకొండను హీరోలుగా పరిచయం చేసింది రామోజీ రావే. 2001లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై వచ్చిన నిన్ను చూడాలని సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందే 2000లో చిత్రం సినిమా ద్వారా రామోజీ రావు సంచలనమే సృష్టించారు. డైరెక్టర్ గా తేజకు, హీరోగా ఉదయ్ కిరణ్ కు అదే మొదటి సినిమా. 2001లో శ్రీనువైట్లను డైరెక్టర్ గా ఆనందం సినిమాతో..2001 లో ఇష్టం సినిమాతో హీరోయిన్ శ్రియను తెలుగు తెరకు పరిచయమ్యారు రామోజీరావు. 2011లో రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన నువ్విలా సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 1990లో మనసు మమత సినిమాతో ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న మాస్టర్ తరుణ్ ను పరిచయం చేసిన రామోజీ రావు పదేళ్ల తర్వాత ఆ కుర్రాడినే 2000లో నువ్వేకావాలి సినిమాతో హీరోగానూ పరిచయం చేశారు. మనసు మమత సినిమాతో కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చింది రామోజీరావే. 1985లో ప్రముఖ డ్యాన్సర్ సుధాచంద్రన్ స్పూర్తిదాయక జీవితంపై మయూరి సినిమా తీసిన రామోజీరావు...1991లో రన్నింగ్ క్వీన్ అశ్వినీ నాచప్ప జీవిత చరిత్రపై అశ్వినీ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాల్లో వాళ్లే నిజజీవిత పాత్రలను పోషించేలా చేశారు రామోజీరావు. 2015లో రాజేంద్ర ప్రసాద్ తో తీసిన దాగుడు మూతల దండాకోర్ రామోజీరావుకు నిర్మాతగా ఆఖరి సినిమా. ఆ తర్వాత మయూరి ఫిలింస్ తో కేవలం డిస్ట్రిబ్యూషన్ కే పరిమితమయ్యారు రామోజీ రావు. తను తీసిన 58సినిమాలతో ఎంతో మంది ప్రతిభావంతులపైన హీరోలను, హీరోయిన్లను, మ్యూజిక్ డైరక్టర్లు, డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామోజీరావు నిర్మాతగానూ తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలను అందించారు.