(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi CMs Meet : మళ్లీ లాక్ డౌన్ ఊహాగానాలు..ఎల్లుండి ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
దేశంలో కరోనా, దాని వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్న తరుణంలో...ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ కానున్నారు. కేసులు భారీగా పెరుగుతున్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు.2020లో కరోనా సంక్షోభం మొదలైన సమయంలో సీఎంలతో ప్రధాని మోదీ పలు దఫాలు చర్చించారు. ఆ సమయంలో లాక్డౌన్ ప్రకటించారు. దీంతో ఈసారి జరగనున్న భేటీలో అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని చర్చ నడుస్తోంది. కానీ ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింతగా దిగజారే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.