అరుదైన ఘనత సాధించిన తొలి కంపెనీగా యాపిల్...
ఐఫోన్, మ్యాక్ బుక్స్... ఇలా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటికీ లోకమంతా క్రేజ్ మామూలుగా ఉండదు. వాటికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. అదే యాపిల్ సంస్థ ఓ అరుదైన ఫీట్ సాధించింది. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరిన తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్ సేవలపై ఇన్వెస్టర్ల నమ్మకంతో నూతన సంవత్సరంలో తొలి ట్రేడింగ్ రోజే మార్కెట్ విలువ ఎగబాకింది. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి ఓ షేర్ విలువ 182 డాలర్ల వద్ద, మార్కెట్ విలువ 2.99 ట్రిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. 1977 జనవరి 3వ తేదీన యాపిల్ తొలి కంప్యూటర్ ను రూపొందించింది. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత అదే రోజున ఈ అరుదైన ఘనతకు చేరుకోవడం విశేషం. మార్కెట్ విలువలో యాపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, టెస్లా ఉన్నాయి. యాపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ 2007లో తొలి ఫోన్ విడుదల చేసిన దగ్గర నుంచి సంస్థ షేర్ విలువ 5,800 శాతం పెరిగింది.





















