ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. 10,143 ఉద్యోగాల భర్తీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2022 మార్చి వరకు భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. రాత పరీక్షలో పొందిన మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అర్హులను ఎంపిక చేస్తామని, ఇంటర్వ్యూ ఉండదని జగన్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఈ భర్తీ చేపట్టినట్లు సీఎం వివరించారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. నిరుద్యోగుల కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు జగన్ వెల్లడించారు. వీటిలో 1,84,164 పర్మినెంట్ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా వాటిలో 3,99,791 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, మరో 19, 701 కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు
ఏ నెలలో ఏ ఉద్యోగ ప్రకటన వెలువడుతుందనే విషయాలు ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉన్నాయి. దీని ప్రకారం 2021 జూలై నెల నుంచి 2022 మార్చి వరకు మొత్తం 10,143 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతిని ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీ (APPSC) , పోలీసు నియామక బోర్డులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఖాళీలను రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వివరించారు.
పోస్టుల వివరాలు..
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు : 10,143
జూలై 2021 : ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ పోస్టులు - 1,238
ఆగస్టు 2021 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 - 36
సెప్టెంబర్ 2021 : పోలీస్ శాఖ ఉద్యోగాలు - 450
అక్టోబర్ 2021 : వైద్య శాఖలో డాక్టర్లు & అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 451
నవంబర్ 2021 : వైద్య శాఖలోని పారామెడికల్, ఫార్మసిస్టులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు - 5,251
డిసెంబర్ 2021 : వైద్య శాఖలో నర్సులు - 441
జనవరి 2022 : విద్యా శాఖ - డిగ్రీ కాలేజీల లెక్చరర్లు - 240
ఫిబ్రవరి 2022 : విద్యా శాఖ - యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 2,000
మార్చి 2022 : ఇతర శాఖల పోస్టులు - 36