ఇంటర్ ఫస్టియర్ మార్కులే సెకండియర్‌కు.. ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు
ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ విద్యా శాఖ జారీచేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కు కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నట్లు తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే అంశంపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను గ్రేడుల విధానంతో నేరుగా సెకండియర్‌లోకి ప్రమోట్ చేయగా.. సెకండియర్ విద్యార్థుల ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. తాజాగా సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర విద్యా శాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
మార్గదర్శకాలు ఇవీ..
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో అవే మార్కులను సెకండియర్‌కి పరిగణలోకి తీసుకుంటామని విద్యా శాఖ పేర్కొంది. అంటే అంటే ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని మార్కులు అయితే వచ్చాయో వాటినే సెకండియర్‌కి కూడా వేస్తారు. ప్రాక్టికల్స్ విషయంలోనూ విద్యా శాఖ పలు విధివిధానాలను రూపొందించింది. ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు (100 శాతం) ఇవ్వాలని నిర్ణయించింది.
ఫస్ట్ ఇయర్‌లో ఏమైనా సబ్జెక్టులు ఫెయిలైన వారిని కూడా 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని విద్యా శాఖ వెల్లడించింది. సాధారణంగా ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన వారు సెకండియర్ సాధారణ పరీక్షలతో పాటు వీటిని రాస్తారు. కానీ సెకండియర్ పరీక్షలు కూడా రద్దు కావడంతో వీరిని పాస్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తామని విద్యా శాఖ పేర్కొంది.
నచ్చకపోతే పరీక్షలు రాసుకోవచ్చు..
సెకండియర్ మార్కుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలు నచ్చకపోతే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కూడా కల్పిస్తామని విద్యా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా పరిస్థితులు అంతా సర్దుకున్నాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అప్పుడు విద్యార్థులు పరీక్ష రాసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది.
సెకండియర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఈ నెల 28న (సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేయనునున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. . ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా, తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,73,967 మంది ఫీజులు చెల్లించారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,28,986 మంది కాగా ఒకేషనల్ విద్యార్థులు 44,981 మంది ఉన్నారు.