Mohammed Siraj Net Worth హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఆస్తుల విలువ ఎంత... అతడి ముద్దు పేరు ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ పరిచయం అక్కర్లేని క్రికెటర్ మహ్మద్ సిరాజ్. టీమిండియా లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టులో అతడు ఆడుతుంటే... ‘వాడు మనోడే’ అని తెలుగు వారు గర్వంగా చెప్పుకుంటారు. ‘మియా మ్యాజిక్’ అనేది మహ్మద్ సిరాజ్ ముద్దు పేరు. ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ అతి తక్కువ సమయంలోనే బాగానే ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు సుమారు సిరాజ్ ఎంత సంపాదించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సిరాజ్ దశ తిరిగింది 2017లోనే
2017లో మహ్మద్ సిరాజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఏడాది IPL కోసం నిర్వహించిన వేలంలో రూ.2.6కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కేవలం రూ.20లక్షల కనీస ధరతో అతడు వేలంలో పాల్గొన్నాడు. IPL-2015లో SRH తరపున ఆడేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ సీజన్లో కేవలం 6 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 10 వికెట్లతో సరిపెట్టుకున్నాడు. సీజన్ ముగిసే సమయానికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్ను సిరాజ్ పై పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తర్వాతి ఏడాది నిర్వహించిన వేలంలో అతడ్ని రూ.2.6కోట్లకు సొంతం చేసుకుంది. 2016 నుంచి ఇప్పటి వరకు సిరాజ్ Kohli నాయకత్వంలోని RCBలోనే కొనసాగుతున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు ఏటా కేవలం IPL ద్వారానే సిరాజ్ రూ.2కోట్లకు పైగా వెనకేసుకుంటున్నాడు. ప్రస్తుతం సిరాజ్ ఆస్తుల విలువ సుమారు రూ.14.5 కోట్లు.
ఏ మ్యాచ్‌కి ఎంత ఫీజు
2017 నవంబరులో భారత జట్టులో సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ పై T20లతో అరంగేట్రం చేశాడు. BCCI కాంట్రాక్టు జాబితాలో లేని సిరాజ్ ఒక్కో మ్యాచ్‌కి ఎంత అందుకుంటున్నాడంటే...
* వన్డేకి - రూ. 6 లక్షలు.
* టెస్టుకి - రూ. 15 లక్షలు.
* టీ20కి - రూ. 3 లక్షలు.
తండ్రి మరణం... సిరాజ్‌కి దక్కని చివరి చూపు
ఒకప్పుడు సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబం కోట్లకు పడగలెత్తింది. IPL ద్వారా బాగానే సంపాదిస్తోన్న సిరాజ్ విలాసవంతమైన ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తండ్రి గౌస్‌ను ఇక ఆ పని నుంచి విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే... కొడుకు ఎదుగుదలను గౌస్ తనివి తీరా చూడలేకపోయాడు. గత ఏడాది నవంబరులో గౌస్ అనారోగ్యంతో మరణించాడు. తండ్రి చివరి చూపుకు కూడా సిరాజ్ నోచుకోలేకపోయాడు. అప్పుడు అతడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. కొవిడ్ నిబంధనల కారణంగా అప్పుడు సిరాజ్ భారత్ రాలేకపోయాడు.
ఇప్పటి వరకు IPLలో 42 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 45 వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే 5 టెస్టులు ఆడి 16 వికెట్లు, 3టీ20లు ఆడి 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఒక్క వన్డే ఆడిన సిరాజ్ వికెట్ల ఖాతా తెరవలేదు.