Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత ఇంకోసారి భారీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం చాన్నాళ్లుగా తెలుస్తూనే ఉంది. కిందటి మండలి సమావేశాల్లో ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అయితే అందుకు ఆమె సన్నద్ధమవుతున్న తీరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సంచలన రాజకీయ వ్యూహకర్త, చాలా కాలంగా పొలిటికల్ స్ట్రాటజీలకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితకు సహాయ సహకారాలు అందిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ కిషోర్ సహకారంతో... తెలంగాణ గడ్డ మీద కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కవిత చేస్తు్న ప్రయత్నాలపై ABP Desam Excluisve కథనం మీకోసం..
కవితకు సాయం చేస్తానని తానే ఆఫర్ చేసిన ప్రశాంత్ కిషోర్
బయట రాజకీయాల్లో వేలు పెట్టకుండా.. చాలా కాలంగా తన సొంత పార్టీ జన సురాజ్ కార్యకలాపాలకే పరిమితమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తనంతట తానుగా ఆ మధ్య కవితకు ఫోన్ చేశారంట. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తెకు సాయం చేస్తానని తానే ఆఫర్ చేశారంట. రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించే IPACను స్థాపించి నడిపించిన ప్రశాంత్ కిషోర్ దేశంలో చాలా రాజకీయ పార్టీలకు సేవలందించారు. ఆ తర్వాత IPAC నుంచి బయటకువెళ్లి సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ పార్టీని నిర్మించుకున్నారు. IPAC నుంచి బయటకెళ్లాక పార్టీలు అడిగితే పర్సనల్‌గా సాయం చేయడమే తప్ప.. ప్రొఫెషనల్‌గా పనిచేయని ప్రశాంత్ కిషోర్ తనంతట తాను కవితకు సాయం చేస్తానని చెప్పడమే విశేషం.
కవితతో వరుస భేటీలు
కవిత బీఆర్‌ఎస్ (BRS)ను వీడినప్పటి నుంచి ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య నాలుగైదు సార్లు చర్చలు జరిగాయి. కవితను కలవడం కోసం ప్రశాంత్ కిషోరే స్వయంగా హైదరాబాద్ వచ్చారు. "ప్రశాంత్ కిషోర్ తో చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. ఆయనంతట ఆయనే మాతో కలుస్తామని ప్రపోజల‌్ పెట్టారు. అక్టోబర్ -నవంబర్ లో కొన్ని సమావేశాలు జరిగాయి. డిసెంబర్‌లో కూడా హైదరాబాద్ వచ్చారు. ఈ సంక్రాంతికి ముందు నాలుగు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుడు ప్రతిరోజూ కవిత- ఆయన చర్చలు జరిపారు" అని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ,ఈ భేటీల్లో పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే విధానం , పార్టీ సిద్ధాంతాలపై లోతైన కసరత్తు జరిగినట్లు సమాచారం. "తెలంగాణ ప్రజల కోసం.. ప్రజల భాగస్వామ్యంతో" అనే నినాదంతో ఈ పార్టీ ఉండాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిశోర్‌తో కవితకు బీఆర్‌ఎస్ లో ఉన్నప్పటి నుంచే సన్నిహిత సంబంధాలున్నాయి. అప్పట్లో ఆ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ సందర్భంగా కవితతో కలిసి పని చేశారు. ఆ సాన్నిహత్యం ద్వారానే ఇప్పుడు తనంతట తానుగా తెలంగాణలో కవితకు సహకారం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు.
50 కమిటీలతో క్షేత్రస్థాయి కసరత్తు
పార్టీ ప్రకటనకు ముందే పక్కా ప్రణాళికతో కవిత ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు , సమస్యలపై లోతైన అధ్యయనం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగానే పార్టీ విధానాలను రూపొందించాలని కవిత నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుతూనే, ప్రజా కేంద్రీకృత పాలనను అందించడమే ఈ కొత్త పార్టీ ప్రధాన ఎజెండాగా ఉండబోతోందని తెలుస్తోంది.
అధికారిక ప్రకటన ఎప్పుడు?
ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, పార్టీ పేరు , లోగోపై కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ పరిణామాలపై అటు కవిత నుంచి కానీ, ఇటు ప్రశాంత్ కిషోర్ నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయినప్పటికీ, కమిటీల ఏర్పాటు, పీకేతో వరుస భేటీలు చూస్తుంటే, తెలంగాణలో త్వరలోనే ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.