Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఉత్సవాలు మొదటి రోజుతో వైభవంగా ప్రారంభమవుతాయి. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, డప్పు దరువుల మధ్య మేడారం పులకించిపోతుంది.
జాతరలో మొదటి రోజు ప్రధాన ఘట్టం సారలమ్మను మేడారం గద్దెకు తీసుకురావడం. సమ్మక్క కుమార్తె సారలమ్మ ప్రతిరూపం అయిన పసుపు, కుంకుమ భరిణె రూపంలో సాయంత్రం వేళలో కన్నెపల్లి గ్రామం నుంచి మేడారానికి తరలిస్తారు. గిరిజన పూజారులు అయిన వడ్డెలు ఉదయాన్నే కన్నెపల్లికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ దేవత గుడి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరుగుతుంది.
ఇదే రోజు సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజును పూనగండ్ల నుంచి, సోదరుడు గోవిందరాజును కొండాయి గ్రామం నుంచి ఊరేగింపుగా మేడారం గద్దెలపైకి చేరుస్తారు. భక్తులు జాతర ప్రారంభానికి సూచనగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి, తమ పాపాలను కడుక్కుంటారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులకు భక్తులు దారిపొడవునా ఎదురువెళ్లి స్వాగతం పలుకుతారు. ఆడపడుచులు నీళ్లతో కాళ్లు కడిగి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి సమయానికి సారలమ్మను మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు లెక్క. సారలమ్మ గద్దెకు చేరుకున్న తర్వాతే భక్తులు తమ మొక్కులను సమర్పించుకోవడం మొదలుపెడతారు.