Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
గిరిజన వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు. ఇంతకూ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏంటో చూద్దాం.
దశాబ్దాల కాలం నుండి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉన్నది. గట్టమ్మతల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారికి గుళ్ళు కట్టి పూజిస్తున్నారు.
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి, సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లేనని చెబుతారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో ఉంది. పెళ్లికాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని. ఇలా అనేకమంది తమ సమస్యలను పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుతుంటారు.