Namit Malhotra's Ramayana The Introduction | రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లతో రామాయణం | ABP Desam
దంగల్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ నితీశ్ తివారీ నుంచి వస్తున్న భారీ చిత్రం రామాయణం.
ఇది సినిమా అనేకంటే మన దేశం కొన్ని వేల సంవత్సరాలుగా గౌరవిస్తూ వస్తున్న ధర్మాన్ని..ఆ రాముడి దివ్య భవ్య సందేశాన్ని ఓ గ్రాండియర్ లెవల్లో ఇప్పటి తరానికి చేరువ చేయటానికి నితీశ్ తివారీ చేపట్టిన లార్జర్ దేన్ ది లైఫ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సృష్టి లయ కారకులైన బ్రహ్మ, చరాచర సృష్టిని రక్షించే విష్ణు, ప్రళయ కారుడైన మహేశ్వరులు పాలిస్తున్న ఈ సమస్త విశ్వాన్ని ఓ చీకటి శక్తి తన అధీనంలోకి తీసుకోవాలని యత్నించినప్పుడు ఉద్భవించిన తేజో రూపుడే శ్రీ రాముడు. మానవ రూపంలో సాధారణ జీవితం గడిపి త్యాగం, ధర్మ పరిపాలనే లక్ష్యంగా అఖండ భారతావనిని ఏలి... భగవత్ రూపంగా ఇన్ని వేల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఆ రామచంద్రుడి కథను రెండు భాగాలుగా చెప్పునున్నట్లు ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్..సీతాదేవిగా సాయిపల్లవి..రావణబ్రహ్మగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నట్లు వీడియోలో ప్రకటించారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం ప్రఖ్యాత హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ ను, ఏఆర్ రెహమాన్ ను కలపటం అతి పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఇక రెండో విషయం ఈ సినిమా విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న లండన్ బేస్డ్ డబుల్ నెగటివ్ విజువల్స్ ఎఫెక్స్ట్ కంపెనీతో కలిసి నితీశ్ తివారీ పనిచేయనున్నారు. ఇంట్రడక్షన్ వీడియో చివర్లో రాముడిగా రణ్ బీర్ ను, రావణుడిగా యశ్ ను గ్లింప్స్ లా చూపించారు. 2026 దీపావళి కానుకగా మొదటి భాగం, 2027 దీపావళి కానుకగా రెండో భాగం విడుదల కానుంది.





















