East Godavari News: మళ్లీ నీట మునిగిన ఆవ భూములు.... ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరొచ్చి సమాధానం చెప్తారని ఓ వ్యక్తి వీడియో
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ఆవ భూములను పేదలకు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారని కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన అడపా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు భూముల పంపిణీపై స్టేటస్కో ఇచ్చింది. ఆ భూములను యథా స్థానంలోనే ఉంచాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పేదలకు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములు అత్యంత లోతట్టు ప్రాంతం ఉన్నాయని, ఇక్కడ సరుగుడు మొక్కలకు తప్ప ఎందుకు పనికిరాని భూములని అడపా శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన నీట మునిగిన ఆవ భూముల వద్ద నిలబడి ఓ వీడియో చేశారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చి సమాధానం చెప్తారో అని ప్రశ్నించారు.
సీఎం జగన్ ఈ భూముల పంపిణీపై పునరాలోచించాలని కోరారు. రెండు సంవత్సరాల్లో నాలుగు సార్లు మునిగిపోయిన భూముల్లో ప్రజలు ఎలా నివాసం ఉండాలన్నారు. ఆవ భూములు 573 ఎకరాలు సేకరించిన ఈ భూములు రూ.7.25 లక్షలు ధర పలుకుతున్న భూమిని ఏకంగా రూ.40 లక్షలకు పైబడి కొనుగోలు చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. గోదావరి ఉద్ధృతి పెరిగినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ భూములు పూర్తిగా మునిగి పోయే పరిస్థితి ఉందన్నారు.