Nellore Floods Rescue: నెల్లూరులో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నెల్లూరు నగరాన్ని వరదనీరు ముంచెత్తింది. దీంతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలసి ముంపు ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి. నెల్లూరుకి సమీపంలోని సాలుచింతల గ్రామానికి వరదనీరు పోటెత్తింది. పెన్నా నది ప్రవాహ తీవ్రతకు వరదనీరు ఊళ్లను ముంచెత్తింది. గతంలో సాలుచింతల ప్రాంతంలో ఈ స్థాయిలో వరదనీరు ఎప్పుడూ రాలేదంటున్నారు స్థానికులు. అటు అధికారులు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేకపోవడంతో ఎక్కడివారక్కడ వరదనీటిలో చిక్కుకుపోయారు. దీంతో నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. పవర్ బోట్ల సాయంతో బాధితుల్ని ఇళ్లలోనుంచి తరలించారు. కట్టుబట్టలతో బయటికొచ్చిన బాధితులు చంటి పిల్లలతో అవస్థలు పడుతున్నారు. వీరందర్నీ పునరావాస కేంద్రాలకు చేరుస్తామంటున్నారు అధికారులు.