ఆ రోడ్డులో వెళ్లాలంటే గుండె ధైర్యం కావాలి..
రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లు, రూపు రేఖలు కోల్పోయిన రోడ్లు చాలానే ఉన్నాయి. కానీ అది గంతలు ఏవీ లేని సిమెంట్ రోడ్డు, కానీ అటవైపు వెళ్లాలంటే మాత్రం గుండెలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. కళ్లముందే బండి ఆగిపోయి భయం భయంతో వాటిని తోసుకు వెళ్లేవారు కనిపిస్తారు, వాహనం స్కిడ్ అయి నీళ్లపో పడిపోయిన వారినీ స్థానికులు కాపాడిన సందర్భాలున్నాయి. కానీ వారికి ఆ దారి తప్ప వేరే దారి లేదు. అందుకే నెల్లూరు రూరల్ మండలం ములుముడి, నర్సింహ కొండ, వెల్లంటి, తాటిపర్తి.. ఇలా దాదాపు 10 గ్రామాల ప్రజలు పొట్టేపాలెం కలుజు దాటి వెళ్తుంటారు. నెల్లూరు చెరువుకి వరదనీరు వస్తే కలుజు ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఇదే చెరువుకి ఉన్న చిన్న కలుజుని శాశ్వతంగా మూసివేయడంతో ఇప్పుడు ప్రవారం అంతా పెద్ద కలుజునుంచే పెన్నా లోకి వెళ్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం పెరిగింది. వాహనాలపై వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొంతమంది అక్కడి వరకు వచ్చి ఆ ఉధృతి చూసి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఏడాది పొడవునా ఇలా నీటితో ఇబ్బంది పడలేమని వాపోతున్నారు.