Gadwal: డెలివరీ మధ్యలోనే వదిలేసిపోయిన డాక్టర్? ఆస్పత్రి ముందు బంధువుల రచ్చ
బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. కాన్పు కాకముందే డాక్టర్ నర్మద వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.
Jogulamba Gadwal News: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటేనే ఎక్కువ మంది ప్రజలకు ఓ రకమైన భయం ఉండే సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చయినా సరే మంచి వైద్యం అందుతుందనే నమ్మకంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ, అసలు డబ్బు పెట్టే స్తోమత లేని వారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం పొందుతూ ఉంటున్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో కూడా వైద్యులు చక్కని వైద్యాన్ని ఉచితంగా అందించి, మందులు కూడా ఫ్రీగానే ఇస్తుంటారు. కానీ, కొన్ని చోట్ల ఒక్కోసారి జరిగే తప్పిదాలు మొత్తం ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయి. అలాంటిదే తాజాగా ఇంకో ఘటన జరిగింది.
ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సరైన వ్యవధిలో చికిత్స అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చనిపోయింది. ఈ ఘటన ఆదివారం (నవంబరు 20) జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal District) జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. నార్మల్ డెలివరీ (Normal Delivery) అయ్యేలా చూస్తామని డాక్టర్లు కుటుంబ సభ్యులతో చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డాక్టర్ నర్మద, వైద్య సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి కాన్పు కాకముందే వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందువల్లే పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో బంధువులంతా కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో డాక్టర్ నర్మద బంధువులకు సమాధానం ఇచ్చారు. శిశువు ఉమ్మ నీరు తాగిందని చెప్పారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదని చెప్పారు. కాన్పు కాకముందే తాను వెళ్లిపోయానని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
తన డ్యూటీ సమయం అయిపోయినా సరే, డెలివరీ కోసం తాను విధులు నిర్వహించానని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ (Jogulamba District Collector) వల్లూరి క్రాంతి కూడా జోక్యం చేసుకున్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. విచారణలో డాక్టర్ల తప్పు ఉందని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మంచి చికిత్స అందించడం ప్రభుత్వం లక్ష్యం అని, అందుకు అనుగుణంగా డాక్టర్లు పని చేయాలని నిర్దేశించారు.
గతంలోనూ ఈ డాక్టర్ డాక్టర్ నర్మద ఓసారి వైద్య తప్పిదం జరిగిన ఘటనలో కొన్నాళ్లు సస్పెండ్ అయినట్లు సమాచారం. థరూర్ మండలం (Tharur Mandal) జాంపల్లికి చెందిన ఓ గర్భిణికి డెలివరీ చేసే సమయంలో నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి (Baby Death) చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.