MS Dhoni: ఈ అడ్రస్‌కు ఎలా వెళ్లాలి బ్రో - ఫ్యాన్‌ను ఆపి సర్‌ప్రైజ్ ఇచ్చిన కెప్టెన్ కూల్
MS Dhoni: కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని తన ఫ్యాన్ కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డుపై ఆపి రాంచీ ఎలా వెళ్లాలంటూ అడిగాడు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని అనగానే ఠక్కున గుర్తొచ్చేది తన కూల్ కెప్టెన్సీ, అద్భుతమైన వ్యూహాలు, ఫినిషింగ్, హెలికాప్టర్ షాట్.. ఇవన్నీ ఆటకు సంబంధించినవి. కానీ, క్రికెట్ మాత్రమే కాకుండా ధోని వ్యక్తిత్వానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. సింప్లిసిటీ, సరదాగా ఉండటం, గెలుపుకు పొంగిపోకపోవడం, ఓటమి వస్తే కుంగిపోకపోవడం, తక్కువ స్థాయి వారిని కూడా మనస్ఫూర్తిగా పలకరించడం లాంటివి చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీ, క్రికెట్ లో వన్ ఆఫ్ ది లెజెండ్, భారత్ లో ఎంతో మందికి ఆరాధ్య దైవం అయినప్పటికీ.. తను మాత్రం ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ అన్నట్లుగానే ఉంటారు. వేలాది కోట్ల అధిపతి అయినా.. చాలా నిరాడంబరంగా ఉంటాడు ధోని. తాజాగా అది మరోసారి నిరూపితం అయింది. ఎలాగంటే..
ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ అందించిన ధోని.. ప్రస్తుతం తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మోకాలి గాయంతోనే సీజన్ అంతా ఆడిన ధోని.. లీగ్ ముగియగానే సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సర్జరీ నుంచి ధోని రికవరీ అవుతున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తాజాగా ధోని తన పాతకాలపు కారులో వెళ్తూ కనిపించాడు. మరో వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తుండగా.. ధోని పక్క సీట్ లో కూర్చొని ఉన్నాడు. అలా వెళ్తూ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను ఆపాడు. తను వెళ్లే చోటు గురించి చెప్పి ఎలా వెళ్లాలని వారిని అడిగాడు ధోని. చాలా ప్రశాంతంగా, సామాన్య వ్యక్తిలా ధోని అలా అడగడంతో ఆ వ్యక్తి కాస్త షాక్ అయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ధోనికి దారి చెప్పాడు. అంతలోనే ఫోన్ తీసి ధోనీతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని తీరు గురించి తన ఫ్యాన్స్ స్పందిస్తూ.. ధోనిని పొగుడుతున్నారు.
This man is so simple and this simplicity is what makes him different from every other celebrity #MSDhoni #Dhoni pic.twitter.com/ErMlX3KGVX
— TAAGASTYA (@LalPatrakar) August 11, 2023
View this post on Instagram
కొన్ని రోజుల క్రితం ధోనికి చెందిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. ధోని తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు. విల్లా గేటు వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డు తన డ్యూటీ కోసం వస్తుండగా.. అతడిని ధోని చూశాడు. విల్లా నుంచి గేటు వరకు చాలా దూరం ఉండటంతో.. సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు ఎంఎస్ ధోని. స్వయంగా తనే అతడిని బైకు పై కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి గేటు వద్ద వదిలిపెట్టాడు. అదే సమయంలో విల్లా గేటు వద్ద ధోనిని చూసేందుకు ఎదురు చూస్తున్న కొందరు అభిమానులు దానిని తమ ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ధోని మంచితనం గురించి, ధోని వ్యక్తిత్వం గురించి తన అభిమానులు పొగుడుతూ కామెంట్లు పెట్టారు.