Emirates Ad of Woman: ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవన శిఖరంపై మహిళ.. ఎమిరేట్స్ ప్రకటన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టింది
ఓ పెద్ద భవనం పైనుంచి కిందకు చూస్తేనే... వామ్మో కళ్లుతిరిగి కింద పడిపోతాం ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. మరి ప్రపంచంలోనే ఎత్తైన భవంతిపై నిలబడితే....! నిలబడితే ఏంటి... ఓ మహిళ నిలబడి షాకిచ్చింది. ఎందుకంటే...
కొండకోనల్లో విన్యాసాలు చేస్తుంటారు... స్కై డైవింగ్ అంటారు...సముద్రంలో సాహసాలంటారు... అవన్నీ ఓలెక్క...ఇప్పుడు చెప్పబోయేది మరోలెక్క. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం కొన అంచున నిలబడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 830 మీటర్ల ఎత్తులో.... ఓ మోస్తరు గాలేసినా కిందకు పడిపోతాం ఏమో అనిపించేంత పైన నిల్చున్నప్పుడు కొందరికి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మరికొందరికి కాళ్లు చేతులు వణికిపోతాయ్...ఇంకొందరికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ మహిళ ప్రపంచంలోనే ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా కొనంచున నిలబడింది. ఆ థ్రిల్ ను భలే ఎంజాయ్ చేసింది.
అయితే, ఇదంతా ప్రపంచంలోనే అత్యున్నత సేవలు అందిస్తుందని పేరున్న విమానయాన సంస్థ ఎమిరేట్స్ వాణిజ్య ప్రకటన కోసం. 33 సెకెన్లున్న ఆ ప్రకటనలో నటించిన మహిళ పేరు నికోల్ స్మిత్ లూద్విక్. ఆమె స్కై డైవింగ్ శిక్షకురాలు. యోగా గురువు కూడా. కొండలు గుట్టలూ ఎక్కే సాహసమూ ఆమె హాబీల్లో ఒకటి. ప్రకటనలో భాగంగా బిల్డింగ్ కొనంచున నిలబడి ‘‘బ్రిటన్ ‘యాంబర్ లిస్టు’లో యూఏఈని చేర్చినందుకు మేం గాల్లో తేలిపోతున్నాం. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్’’అనే ప్లకార్డులను నికోల్ ప్రదర్శించింది.
ఈ అనుభవం గురించి మాట్లాడమంటే...గాల్లో తేలినట్టుంది...మాటల్లో చెప్పలేనంటోంది నికోల్. తన జీవితంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన స్టంట్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదంది. ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని చేయలేదని ఆమె తెలిపింది. ఈ రేంజ్ క్రియేటివిటీ మార్కెటింగ్ ఐడియాకు జోహార్లు అని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని ఆమె ప్రశంసించింది. ఈ బృందంలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నా అంది. ఇంత మంచి ప్రకటనను షూట్ చేసినందుకు ఎమిరేట్స్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రకటనకు తనను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందంది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
వీడియో:
మరోవైపు అసలు ఇది రియలా-ఫేకా అనే టీమ్ తయారైంది. అస్సలు తగ్గని వ్యక్తులు కొందరు... ఇది నిజమా? అబద్ధమా? ఫేక్ వీడియోను ఏమైనా పోస్ట్ చేశారా అని నేరుగా సంస్థకే ట్వీట్లు చేయడం మొదలుపెట్టారట. దీంతో అది ఫేక్ కాదు.. నిజమేనని క్లారిటీ ఇచ్చింది ఫ్లై ఎమిరేట్స్ సంస్థ. అంతకు మించి అనేట్టు... ఆ ప్రకటనకు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
బహుశా ఈ విధమైన ఐడియా మరే వైమానిక సంస్థకూ వచ్చి ఉండదని భావిస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో చూసి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని, ఈ మహిళను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎన్నో ప్రకటనలు చూశాం కానీ...ఇలాంటి ప్రకటన చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్స్ పెడుతున్నారు.