Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్
Rains in Andhra Pradesh Telangana: ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గురువారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 6, 2022
అక్టోబర్ 7 న వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీపై అల్పపీడనం ప్రభాంతో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో పిడుగులు పడతాయని హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
Impact based weather forecast for the districts of Andhra Pradesh and Vijayawada city for next 2 days Dated 06.10.2022. pic.twitter.com/l50CYgTjNI
— MC Amaravati (@AmaravatiMc) October 6, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
మహారాష్ట్రలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో నుంచి తేమను కోస్తాంధ్రలోని మధ్య భాగాలైన ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి వస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం వలన మంచి తేమ చేరడంతో రాయలసీమ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కడప జిల్లాలోని ఉత్తర భాగాలు, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పరిసరాలు, సత్యసాయి జిల్లా పుట్టపర్తి - కదిరి వైపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగనున్నాయి.