(Source: ECI/ABP News/ABP Majha)
Weather: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ - ఈ జిల్లాల్లో వర్షాలు
Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఏపీ, ఇటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Weather Condition in Telugu States: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తెలంగాణలో (Telangana) రాబోయే 4, 5 రోజులు భారీ కురవనున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీతో పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొన్నారు. నల్గొండ (Nalgonda), రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జగిత్యాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వెల్లడించారు.
83 శాతం లోటు వర్షపాతం
తెలంగాణలో ఈసారి ఈశాన్య రుతుపవనాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 117.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 20.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. నిర్మల్ జిల్లాలో అత్యల్ప వర్షపాతం 0.6 మి.మీ, ఆ తర్వాత వరుసగా జగిత్యాల 2 మి.మీ, పెద్దపల్లి 5.7 మి.మీ, రాజన్నసిరిసిల్ల 7 మిల్లీ మీటర్లు, సిద్దిపేటలో 9.3, మెదక్ 12.2, కరీంనగర్ 12.7 , మహబూబ్‌నగర్‌లో 13.8, ఆదిలాబాద్‌లో 15.4, కామారెడ్డిలో 15.7 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వైరాలో 4.5 మి.మీ, కొణిజర్ల 2.4, బోనకల్‌లో 2, భద్రాద్రి కొత్తగూడెం ముల్కలపల్లెలో 3.4, సూర్యాపేట జిల్లా కోదాడలో 1.8, తిరుమలగిరిలో 0.5, సూర్యాపేటలో 0.2, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నవంబర్‌లో ఇప్పటి వరకు 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో ఈ జిల్లాల్లో
అటు, ఈ అల్పపీడన ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని, ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆరు రోజుల పాటు వానలు కురుస్తాయని పేర్కొంటున్నారు. సోమవారం అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తర కోస్తా, యానాంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
రైతుల ఆందోళన
కాగా, ఏపీలో ఈ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికందే సమయానికి వానలు పడి పొలాల్లో నీళ్లు చేరి, వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply