(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి బాగా తగ్గిపోయిన వర్షాలు - అసలు కారణం ఇదీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 5) ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆగస్టు 9 వరకూ ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
వర్షాలు తగ్గడానికి కారణమిదే
‘‘అల్పపీడనాలు మన తెలుగు రాష్ట్రాల వైపు రావడం తగ్గుముఖం పట్టడం, పసిఫిక్ లో పెరుగుతున్న ఎల్-నినో ప్రభావం వలన వర్షాలు తగ్గిపోయాయి. నేడు కూడా చాలా ప్రాంతాల్లో ఎండాకాలం లాగా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు దక్షిణ ఆంధ్రలో ముఖ్యంగా చిత్తూరు నగరం, చిత్తూరు జిల్లాలోని తమిళనాడు పరిసరాల్లో నేడు రాత్రి వర్షాలను చూడగలం. ఇది కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాలోని దివిసీమ వైపు కూడ కొన్ని వర్షాలు (అక్కడక్కడ) మాత్రమే ఉంటుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొండ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులకు అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు, తుఫాను, పిడుగులు
పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్-గోవా మరియు కోస్టల్ కర్ణాటకలో విస్తారంగా వర్షాలు, తుఫాను అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశం, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ (ప్రాంతం), విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.