Weather Latest Update: నేడు మరో ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, రేపు అతి భారీ - ఆరెంజ్ అలర్ట్ జారీ: ఐఎండీ
మరో ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 3వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది.
నిన్న ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టంకి 4.5 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజూ అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి 3.1 కిమీ ఎత్తు లో విస్తరించి ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడిందని తెలిపారు. నిన్న అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి వున్న ద్రోణి ఈరోజు విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగుతూ సముద్ర మట్టంకి 0.9 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉంది. మరో ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 3వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాబోయే తడుపరి 48 గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ వాతావరణ పరిస్థితుల్లో భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబర్ 4న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
‘‘ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అలాగే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు తిరుపతి నగరం, నెల్లూరు నగరంలో మరో రెండు గంటల్లో వర్షాలు దంచికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నేడు ఉదయానికి గుంటూరు, పల్నాడు, ఎన్.టీ.ఆర్., కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశాలు 100 శాతం కనిపిస్తోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.