Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో గాలిదుమారం! వర్షాలు కూడా - ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి పశ్చిమ విదర్బ లోని ఆవర్తనం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో నేడు కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వడగండ్లు కూడా పడే అవకాశం ఉంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 91 శాతం నమోదైంది.
నిన్న ఇక్కడ భారీ వర్షాలు
తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాలు, జనగామ, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్ లోని ఏకాంత ప్రదేశల్లో కొన్ని చోట్ల వర్షం కురిసింది.
ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
‘‘గాలుల సంగమం మరింత బలపడి కర్నూలు, నంధ్యాల ప్రాంతం పైన విరుచుకుపడింది. దీని వలన ఉదయం నుంచి విపరీతం అయిన పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కర్నూలు నగరంతో పాటుగా నంధ్యాలలో కనిపించింది. ఈ వర్షాలు మరో రెండు గంటలు కొనసాగి తగ్గుముఖం పట్టనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.