Weather Updates: బంగాళాఖాతంలో నేడు మరో అల్ప పీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఇలా..
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం(సెప్టెంబరు 24న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు.
గురువారం రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే సెప్టెంబరు 25న ఉదయం వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షప్రభావం ఉంటుందని వివరించారు.
Watch: అసలు పిడుగులు ఎందుకు పడతాయి.? పిడుగుపాటుకు కారణమయ్యే సైన్స్ ఏంటి?
బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అనంతరం 24 గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, ఉపరితల ఆవర్తనం తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్యలో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 24న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వివరించారు.
Also Read: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో వ్యూహాలపై వివిధ పార్టీల చర్చలు
ఏపీలోనూ వానలు
ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానంగా నైరుతి గాలుల ప్రభావం ఉన్నట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ తమిళనాడు తీరం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావారణ పరిస్థితులు ఈ విధంగా ఉండనున్నాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: RGV : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?
శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. రాయలసీమలో వచ్చే రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.