Weather Latest Update: ఎండల నుంచి కాస్త ఊరట కలిగే ఛాన్స్! తగ్గనున్న వేసవి తాపం
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి తెలంగాణ నుండి రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల మరియు రేపు 40 డిగ్రీల కన్నా ఎక్కువ అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల, రేపు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు దకొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
21వ తేదీ నుండి 4, 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో 21 వ తేదీ నుండి 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 40 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.