Weather Latest Update: ఏపీ మళ్లీ భారీ వర్షం ముప్పు! తెలంగాణలో మరింత పెరగనున్న చలి, ఈ జిల్లాల్లో గజగజే!
తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18కల్లా దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతానికి వాతావరణ అధికారుల అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
దాంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఈశాన్య దిశ నుంచి చలిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.
ఏపీలో 19 నుంచి భారీ వర్షాలు
ఈ నెల 19వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని (IMD Predicts Heavy Rainfall) అంచనా వేస్తున్నారు. అల్ప పీడనం వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. అలాగే, వచ్చే మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజుల వరకు చలి ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ తెలిపారు. ఉత్తర భారత దేశం నుంచి చల్లటి గాలులు దిగువకు వస్తున్నాయని, రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగేందుకు అది కూడా కారణమని తెలిపారు.
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ రాత్రి వేళ, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో బుధవారం ఉదయం 7.2 డిగ్రీల అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 9.6 డిగ్రీలు, కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో 9.6 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజేంద్ర నగర్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. తెలంగాణలో సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అతి తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్‌లో తెలిపారు.
ఈ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం రోజు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 16, 2022