Weather Latest Update: ఏపీలో కాస్త లేట్‌గా ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్! తెలంగాణలో మండుతున్న ఎండలు - ఐఎండీ
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
‘‘ఈ రోజు నైరుతి రుతుపవనాలు తెలంగాణా రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి (నల్గొండ వరకు) తిరోగమించాయి. ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఈశాన్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 69 శాతంగా నమోదైంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు ఎండాకాలం మాదిరిగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సమయానికి నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. సాధారణంగా ఈ సమయానికి వాతావరణం చల్లబడుతుంది.
కానీ, సగటున 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం ఎండాకాలం సీజన్‌ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా, ఆకాశంలో మేఘాలు ఏర్పడకుండా నిర్మలంగా ఉంటుండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా
తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
‘‘సాధారణంగా ఈశాన్య రుతుపవన వర్షాలు కోస్తాంధ్రలో ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మొదలవ్వాలి కానీ ఈ సారి ఆలస్యం కానుంది. దీని వలన వర్షాల లోటు సరాసరి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత మూడేళ్లగా అధిక వర్షాలు నమోదయ్యాయి. కానీ ఈ సారి మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఈ సారి అక్టోబర్ చివరి వారం వరకు అనుకూలంగా లేదు కాబట్టి వర్షాలు కొంత వరకే ఉండనున్నాయి. అలాగని వర్షాలే ఉండవని కాదు. తక్కువ మొత్తంలో ఉంటాయి. నైరుతి రుతుపవనాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి నిష్క్రమించాయి. దీని వలన వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్తంత వేడి, చలి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.