Weather Updates: తెలంగాణకు చల్లటి కబురు, రాబోయే రెండ్రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు
Weather Updates: తూర్పు మధ్య ప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండ్రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే రెండ్రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తూర్పు మధ్య ప్రదేశ్ నుంచి విధర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అాలగే శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ఠ ఉష్ణోగ్రత నల్గొండలో 42.5 డిగ్రీల చొప్పున నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత మొదక్ లో 25.0 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యాయి. రాష్ట్రానికి వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వడదెబ్బతో ముగ్గురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన ముగ్గురు ఒకేరోజు వడదెబ్బ కారణంగా చనిపోయారు.75 ఏళ్ల వయసు కల్గిన అచ్చె రామారావుకు వడదెబ్బ తగలగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బేతం చిన్ని, 48 ఏళ్ల తన్నీరు మనోహన్ కూడా వడదెబ్బతో మృతి చెందారు.
హైదరాబాద్ లో ఇలా..
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 36 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేపు 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా 5, గుంటూరు 1, కాకినాడ 1, ఎన్టీఆర్ 2, పల్నాడు 2, మన్యం 5, విజయనగరం 5, వైఎస్సార్ జిల్లాలోని 8 మండలాలు, ఎల్లుండి 33 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.1 డిగ్రీలు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, వైస్సార్ జిల్లా బద్వేల్ లో 45 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవని, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 27 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు.